కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్..ఆయన అహంకారం పరాకాష్టకు చేరింది: మహేశ్ కుమార్ గౌడ్

కేటీఆర్ భస్మాసురుడికి బ్రదర్..ఆయన అహంకారం పరాకాష్టకు చేరింది: మహేశ్ కుమార్ గౌడ్
  • ఆయనలో అహంకారం పరాకాష్టకు చేరింది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 
  • ఎవర్ని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు 
  • అయినా వాళ్లు మారకపోతే ప్రజలే తరిమికొడ్తరు
  • కేటీఆర్.. ముందు ఆయన చెల్లెకు జవాబు చెప్పాలని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: భస్మాసురుడికి కజిన్ బ్రదర్‌‌గా కేటీఆర్ మారారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆయనలో అహంకారం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. ‘‘బంగారు తెలంగాణను భ్రష్టుపట్టించిన భ్రష్టాసుర సైన్యం బీఆర్ఎస్ నేతలది. ప్రతి ఎన్నికలో ఓటమి ఎదురైనా వాళ్లు మారడం లేదు. ఇక వాళ్లు మారకపోతే ప్రజలే తరిమికొడ్తరు” అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ ఆదివారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఎవర్ని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని మహేశ్ గౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘కేటీఆర్.. ముందు మీ చెల్లె కవిత వేస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పు. ఆ తర్వాత కాంగ్రెస్ గురించి, మా పార్టీ నేతల గురించి మాట్లాడు. పదేండ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినందుకు అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయితీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ను ప్రజలు శిక్షించారు. అయినా మీరు  మారడం లేదు” అని మండిపడ్డారు.
 
శిక్షించాల్సింది బీఆర్ఎస్ నేతలనే.. 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేసిందని, శిక్షించాల్సింది బీఆర్ఎస్ నేతలనే అని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘కాళేశ్వరం అవినీతితో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను ఛీకొట్టారు. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో వాళ్ల బాగోతం బయటపడుతున్నది. ఈ భయంతోనే అసెంబ్లీ నుంచి పారిపోయారు. పాలమూరు ప్రాజెక్టు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్, సబ్సిడీ గ్యాస్, సన్న బియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ కేటీఆర్‌‌కు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు. 

కేసీఆర్ చావును కోరుకునేది కేటీఆర్, హరీశే: చామల

కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ కోరుకోలేదని.. ఆయన చావును కోరుకునేది కేటీఆర్, హరీశ్ రావేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘‘సీఎం పదవి కోసం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని లాక్కునేందుకు హరీశ్.. కేసీఆర్ చావును కోరుకుంటున్నారు. కేసీఆర్ మంచిని కోరుకునే వ్యక్తి రేవంత్ మాత్రమే. అందుకే ఆయన ఆస్పత్రిలో ఉంటే వెళ్లి పరామర్శించారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

కేటీఆర్.. విశ్వాసఘాతకుడు: ఆది శ్రీనివాస్

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలని కేటీఆర్ అనడంతో.. ఆయన ఎంతటి విశ్వాసఘాతకుడో అర్థమవుతున్నదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ‘‘కేటీఆర్‌‌లో అసహనం తారాస్థాయికి చేరింది. రాహుల్‌పై ఇంత పిచ్చిపిచ్చిగా మాట్లాడడం.. ఆయన నీచ మనస్తత్వానికి నిదర్శనం. కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదు. భవిష్యత్తులోనూ కోరుకోరు. మా ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట ప్రభుత్వం అని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్‌‌.. మీదే సర్వస్వాహా ప్రభుత్వం. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సాగనంపారు. పదేండ్ల తప్పులను అసెంబ్లీలో తూర్పార పట్టడంతో కేటీఆర్, హరీశ్ రావు తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ ఛాంపియన్స్ గా చెప్పుకొని తిరుగుతున్న కల్వకుంట్ల కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో ఎండగట్టడంతో ఆగం అవుతున్నారు” అని పేర్కొన్నారు.