పట్టాలివ్వకుంటే ఎమ్మెల్యే ఇంట్లోనే  వంటా వార్పు

 పట్టాలివ్వకుంటే ఎమ్మెల్యే ఇంట్లోనే  వంటా వార్పు

గచ్చిబౌలి గోపన్ పల్లిలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలంటూ.. వడ్డెరల ఇళ్లను సర్కార్ కూల్చేయడం దారుణమన్నారు. క్రిస్మస్ పండగ రోజు పేదల కళ్లలో నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్. ఇక్కడి పేదలకు పట్టాలిచ్చి, డబుల్ బెడ్రూంలు కట్టిస్తామన్న ఎమ్మెల్యే హామీ మర్చిపోయారని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో వీరిని అనాథలుగా చేసిందని తెలిపారు. 30ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వీరికి 60 గజాల భూమి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, వడ్డెరలకు అండగా ఉంటుందని.. పట్టాలిచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లో వంటా వార్పు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ మంత్రి.. గోపన్ పల్లి వడ్డెరకాలనీలో ఇళ్ల కూల్చివేతపై స్పందించాలన్నారు రేవంత్.

పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని..  దాదాపు వెయ్యిమంది చెట్లకింద ఉండటం దారుణమన్నారు.  ఈ పండుగపూట క్రిస్ మస్ శుభాకాంక్షలు చెప్పాలన్నా ఇబ్బందిగానే ఉందన్నారు రేవంత్ రెడ్డి.