మోసం, కేసీఆర్.. కవల పిల్లలు

మోసం, కేసీఆర్.. కవల పిల్లలు
  • పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి విమర్శ
  • రేపు, ఎల్లుండి కేసీఆర్​ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో దీక్ష చేస్తా
  • దళితులకు ఇచ్చిన హామీలు ఏమైనయ్​
  • వాళ్లకు రూ. పది లక్షలు కాదు.. ఏం చేసినా తక్కువే

హైదరాబాద్, వెలుగు: “మోసం, కేసీఆర్ కవల పిల్లలు. గత ఏడేండ్లలో దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. వాళ్లకు రూ.10 లక్షలు కాదు, ఏం ఇచ్చినా తక్కువే” అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దళిత బంధు స్కీమ్ అద్భుతమని వంద మంది టీఆర్​ఎస్  ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో తిరిగి చెప్పగలరా ? అని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్​లో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. అందుకే కేసీఆర్​ దత్తత గ్రామమైన మేడ్చల్​ జిల్లా మూడు చింతలపల్లిలో ఈ నెల 24, 25 తేదీల్లో దళిత, గిరిజన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.  మూడు చింతలపల్లిలో డెవలప్​మెంట్ ఎంత జరిగిందో మీడియాకు చూపిస్తానన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే  తాను గజ్వేల్ కు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ బైపోల్ బాధ్యత దామోదరదే
హుజూరాబాద్  బైపోల్​కు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ అన్ని అంశాలను దామోదర రాజనర్సింహ, ఆయన కమిటీ నే చూసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎంపిక, ప్రచారంతోపాటు అన్ని అంశాలు ఆ కమిటీ చూస్తుందని చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కావడానికి కారణం కేసీఆర్ అని అన్నారు. ఈటల అవినీతి గురించి హడావుడి చేసిన కేసీఆర్.. ఆయన బీజేపీ లో చేరాక ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీఆర్​ఎస్, బీజేపీలవి కొనుగోలు రాజకీయాలని ఆరోపించారు.  కౌశిక్ రెడ్డి టీఆర్​ఎస్​లో చేరడం , ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాననడం చైల్డ్ రేప్ లాంటిదని ఎద్దేవా చేశారు. పీసీసీ పూర్తిస్థాయి కమిటీకి ఇంకా సమయం పడుతుందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ యాత్రలు బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాల పోరాటమే అని విమర్శించారు. జగ్గారెడ్డి ఏఐసీసీకి రాసిన ఏ లేఖ కూడా తన దృష్టికి రాలేదన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి ఆఫీసర్ అని,  కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగానే ఆయన బయటికి వచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రవీణ్ కుమార్ గురించి తాను  మాట్లాడింది రాజకీయాల గురించి కాదని, కేవలం అధికారిగా ఆయన పనితనం గురించే అని  అన్నారు. బీఎస్పీతో కలిసి పనిచేయాలా వద్దా అనే చర్చ తమ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో జరగలేదని పేర్కొన్నారు. 

రేవంత్​కు రాఖీ కట్టిన సీతక్క 
రాఖీ పౌర్ణమి సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు, మహిళ కాంగ్రెస్ నేత నేరెళ్ల శారద  రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఆడబిడ్డలందరికీ రేవంత్ రెడ్డి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు అండగా... వారి సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పోరాటం చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.