సిద్దిపేట వివాదంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్

సిద్దిపేట వివాదంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డితో గజ్వేల్ నియోజకవర్గ నేత కొమ్ము విజయ్ మధ్య కొనసాగుతున్న వివాదంపై బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమై చర్చించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నర్సారెడ్డిపై కొనసాగుతున్న వివాదంపై విజయ్ నుంచి వివరణను అడిగి తెలుసుకున్నారు. 

ఈ వివాదంపై ఇప్పటికే నర్సారెడ్డి.. కమిటీ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఈ వివాదానికి త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ముగింపు పలకనుంది. మీటింగ్ అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. పార్టీ గీత దాటిన వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించేది  లేదని హెచ్చరించారు. పార్టీలో ఎవరైనా సరే సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఇక కేటీఆర్, హరీశ్ లు కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పగటి కలలను కంటుందని ఎద్దేవా చేశారు.