
- బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా మాకు ఈక్వల్ కాదు
- మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట.. ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు
- బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే
- కాళేశ్వరంపై సీబీఐ విచారణను కోరితే ఎందుకు స్పందిస్తలే
- బీఆర్ఎస్ను కాపాడుతున్న బీజేపీ
- ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా–ఈ రేసు కేసులో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదని, జైలుకు వెళ్లడం పక్కా అని, ఆయనను ఎవరూ కాపాడలేరని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడమేమిటి? ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కేటీఆర్‌ది పిరికిపంద చర్య. ఆయనే.. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండని అంటడు. రాత్రికిరాత్రే కోర్టుకు వెళ్లి నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నరని మొసలి కన్నీళ్లు కారుస్తడు. ఇదంతా.. తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నరు’’ అని పేర్కొన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన మహేశ్‌గౌడ్ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. నాడు ఏడు మండలాలను ఏపీలో కలపడానికి కేసీఆర్ అంగీకరించడమే అతిపెద్ద తప్పు అని, ఆ ఏడు మండలాల ప్రజల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు. ‘‘స్థానికత అంశంలోనూ బీఆర్ఎస్ అలాంటి తప్పులే చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల బాధలు దారుణంగా ఉన్నాయి. ఈ విషయం గురించి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించిన’’ అని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట
బీఆర్ఎస్ పార్టీలో నాలుగు ముక్కలాట నడుస్తున్నదని మహేశ్ గౌడ్ విమర్శించారు. ‘‘గత.. పదేండ్ల పాపాలు ఒకవైపు, బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. ఇక ఆ పార్టీ కోలుకునే పరిస్థితే లేదు. ఇక ఆ పార్టీ పునర్జీవం పోసుకోవడం సాధ్యం కాదు. కవిత, హరీశ్‌రావు, కేటీఆర్ ఎవరి దారి వారిదే.. కేసీఆరేమో ఫామ్‌హౌస్‌లో ఉన్నరు. ఈ టైంలో ఏం చూసి ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తరు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసినా.. మాకు ఈక్వల్ కాదు” అని వ్యాఖ్యానించారు. ‘‘కవిత తీరు పొలిటికల్ సూసైడ్. ఆమె ఎందుకలా చేస్తున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబ పంచాయితీతో సంబంధం లేదు. ఆమెకు మంత్రిపదవి ఇస్తారనేది వందశాతం అవాస్తవం. పదేండ్లు అందినకాడికి దోచుకుని ఇప్పుడేమో డ్రామాలు ఆడితే సరిపోతుందా? ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కేసీఆర్ ఆడించిన డ్రామానే’’ అని కొట్టి పారేశారు.
బీసీ బిల్లులను ఎందుకు ఆమోదిస్తలే
బీసీ బిల్లులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మండిపడ్డారు. బీజేపీ వాళ్లు తలచుకుంటే వాటికి కేంద్రం ఒక్కరోజులోనే ఆమోదం తెలుపొచ్చని అన్నారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనసు పెడితే 24 గంటల్లో బీసీ బిల్లులకు ఆమోదం లభిస్తుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాళ్లు బీసీ బిల్లులను అడ్డుకుంటున్నరు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీలకు మంచి జరిగే విషయంలో రాజకీయాలను పక్కనపెట్టాలి. సీఎం బీసీ కాకపోయినా.. మంచి మనసుతో బీసీ బిల్లుల విషయంలో పెద్దన్న పాత్ర పోషించారు. ఆ చిత్తశుద్ధి బీజేపీలో ఎవరికీ లేదు’’ అని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ సీట్ మాదే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎప్పుడు బై ఎలక్షన్ జరిగినా ఆ సీటు తమదే అని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సర్వే ఆధారంగా, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థిని నిలుపుతామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగిందని.. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ సింపథి ఉన్నా స్థానిక ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని, కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించారని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందన్నారు.
అయితే.. జూబ్లీహిల్స్‌లో గెలుపొందిన వారికి మంత్రి పదవి అనే ప్రచారంపై స్పందిస్తూ.. ఈ అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు. ఏఐసీసీ అధిష్టానం, సీఎం మాత్రమే చూసుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం సర్వేలు
డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ పరిశీలకులు నేరుగా జిల్లాల్లో సర్వేలు నిర్వహిస్తారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. అధ్యక్షుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ ప్రమేయం ఉండదని, ఆ జిల్లా పరిధిలోని మండల స్థాయిలోని నేతలతోనూ చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచనతోనే తాను పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ను కాపాడుతున్న బీజేపీ
బీఆర్ఎస్ పార్టీని కాపాడాలని బీజేపీ చూస్తున్నదని మహేశ్‌గౌడ్ ఆరోపించారు. ‘‘-కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటానని చెప్పిన కిషన్ రెడ్డి ఎక్కడికి పోయారు? సీబీఐకి అప్పగించి రోజులు గడుస్తున్నా.. కిషన్ రెడ్డి ఎందుకు నిద్రావస్థలో ఉన్నరు. సీబీఐ ఎందుకు ఆలోచిస్తున్నది? ఎందుకు ఆలస్యం చేస్తున్నది? కావాలంటే.. తెలంగాణలో మేమే చర్యలు తీసుకోవచ్చు కానీ, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ కాబట్టి కేసును సీబీఐకి అప్పగించినం. కేసీఆర్ లాగా నియంతపాలన చేయట్లేదు’’ అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే -2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని మహేశ్ గౌడ్ దుయ్యబట్టారు. ‘‘ఈ ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద కేసు. నన్ను విచారణకు పిలిచారు. వెళ్లి వివరణ ఇచ్చా. నాది, రేవంత్ రెడ్డిది ఎన్నికల కంటే రెండున్నరేండ్ల ముందు నుంచే ట్యాప్ చేశారు’’ అని తెలిపారు.
ఆ కలెక్టర్ల తీరు సరికాదు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విషయంలో జరిగిన ప్రొటోకాల్ అంశం ప్రభుత్వ గౌరవానికి సంబంధించిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని సీఎంను తాను కోరినట్లు చెప్పారు. స్థానికంగానూ కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు, కోర్టు ఆదేశాలను పక్కన పెట్టేలా వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఇప్పటికే సీఎస్ రామ కృష్ణారావు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలోనూ పెద్దపల్లి కలెక్టర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు.