హైదరాబాద్‌సిటీ, వెలుగు: రోడ్డు భద్రత అనేది సమాజం మొత్తం బాధ్యత అని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు భద్రతను పాఠశాల స్థాయి నుంచే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ సేఫ్టీ మాసం ముగింపు సందర్భంగా నగరంలోని అలియా మోడల్ హై స్కూల్లో ట్రాఫిక్ అవగాహన పార్క్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఎస్డీఎఫ్ ఫండ్స్, యునిసెఫ్ సహకారంతో రూ.14 లక్షలతో అభివృద్ధి చేసిన ఈ పార్క్ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటైన తొలి ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లల పార్క్‌గా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్, ప్రతిజ్ఞ విధానాన్ని ట్రాన్స్‌పోర్ట్ శాఖ అమలు చేయనుందని, ఇదే తరహా పార్కులను ఇతర పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
పార్క్‌లో చిన్న పరిమాణ ఆస్ఫాల్ట్ రోడ్లు, లేన్ మార్కింగ్‌లు, జీబ్రా క్రాసింగ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలు ఏర్పాటు చేశామని, తద్వారా పిల్లలు ట్రాఫిక్ క్రమశిక్షణను ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారన్నారు. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, కలెక్టర్ హరిచందన, జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ పాల్గొన్నారు.
