చిట్యాల, వెలుగు : జాతీయ రహదారి 65పై వీకెండ్‌లో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో,పెద్దకాపర్తి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బ్లాక్ స్పోర్ట్స్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శనివారం, ఆదివారం కావడంతో హైదరాబాద్ నుంచి పల్లె ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి నగరానికి బయలుదేరడంతో రహదారిపై ఆదివారం మధ్యాహ్నం నుంచే వాహనాల రద్దీ పెరిగింది.
ముఖ్యంగా భారీ లారీలు, కంటైనర్లు, కార్లు, బస్సులు ఒకేసారి చేరడంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు కేవలం మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు దాదాపు 30 నిమిషాల పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ తో వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు స్పందించి త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేసి ట్రాఫిక్ జాములకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
