
హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. రాబోయే శ్రీ జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాలు జూన్ 26 నుండి జూలై 24 వరకు జరగనున్నాయి. ఈ పండుగకు తెలంగాణ, ఆంధ్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆక్షలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
జూన్ 26న తొలి పూజ తో ప్రారంభమయ్యే మహంకాళీ బోణాలు జులై 24 వరకు కొనసాగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ ఫలితంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల కోసం మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ జోన్‌లు, అలాగే హెల్ప్‌లైన్‌లను ప్రకటించారు. ఉత్సవాల సమయంలో ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే గోల్కొండ కోటకు వెళ్లే మార్గాలకు సంబంధించిన ట్రాఫిక్ ఆక్షలను ప్రకటించారు.
హైదరాబాద్ బోనాల సందర్భంగా జూన్ 26, 29, జులై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి.
ట్రాఫిక్ డైవర్ట్ చేసే మార్గాలు:
- రాందేవ్ గూడ నుంచి మక్కా దర్వాజ మీదుగా గోల్కొండ వెళ్లే రూట్
- ఫతే దర్వాజా మీదుగా లంగర్ హౌజ్ నుండి గోల్కొండ కోట వెళ్లే మార్గం
- బంజారా దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు 7 టూంబ్స్, షేక్‌పేట నాలా
పండుగ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వాహనదారులు ఈ రూట్లను అవాయిడ్ చేయడం మంచిదని సూచించారు.
భక్తుల పార్కింగ్ జోన్లు:
మక్కై దర్వాజ మీదుగా రాందేవ్ గూడ వచ్చే వాహనదారులకు అషూర్ ఖానా, ఆర్మీ సెంట్రీ పోస్ట్, రాందేవ్ గూడ, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పట్లు చేశారు. అదేవిధంగా సెట్విన్ బస్సులను అషూర్ ఖానా పార్కింగ్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
ఫతే దర్వాజా మీదుగా లంగర్ హౌజ్ నుంచి వచ్చే భక్తులకు MCH పార్క్, ఫతే దర్వాజా; గోల్కొండ బస్ స్టాప్; అల్హీరా స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
షేక్‌పేట్ నుండి బంజారా దర్వాజా మీదుగా వచ్చే భక్తులకు గోల్ఫ్ క్లబ్ రోడ్ బై-లేన్, హాకీ గ్రౌండ్; ఒవైసీ గ్రౌండ్; డెక్కన్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఏరియాల్లో పార్కింగ్ ఉంటుంది.
ట్రాఫిక్ జామ్ కారణంగా వచ్చే సమస్యల కోసం +91 9010203626 అనే ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు . సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటారు.