బండ్లు లక్షలు.. రోడ్లు జానెడు

బండ్లు లక్షలు.. రోడ్లు జానెడు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో ట్రాఫిక్​ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. బండేసుకుని బయటికి వెళ్దామంటే అమ్మో అనిపిస్తోంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా మారిపోతోంది. ఈసారి శుక్రవారం కురిసిన తొలి వానకే నగరంలోని చాలా రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్​ ప్లానింగ్​ సరిగా అమలు చేయకపోవడం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను పట్టించుకోకపోవడం, రోడ్లపైనే వాహనాల పార్కింగ్, షాపింగ్​ మాల్స్, సినిమా థియేటర్లు ప్రధాన రోడ్లపైనే ఉండటం వంటివి ట్రాఫిక్​ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. హైదరాబాద్​ ట్రాఫిక్​ పరిస్థితి ఇలా దుర్భరంగా మారుతుందని 29 ఏళ్ల కిందే ఇంజనీర్ల కమిటీ హెచ్చరించినా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

‘ట్రాఫిక్’కు కారణాలెన్నో..

హైదరాబాద్​ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే నగర జనాభా కోటి దాటింది. అయితే రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ఫ్లైఓవర్ల సంఖ్య పెంచలేదు. సిటీలో తొమ్మిది వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఉంటే.. అందులో మెయిన్ రోడ్లు 1,500 కిలోమీటర్లు ఉంటాయి. మొత్తంగా 54 లక్షల వాహనాలు ఉండగా రోజూ మరో వెయ్యి కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. కానీ రోడ్ల వైశాల్యంలో హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. ముంబై సిటీలో రోడ్ల వైశాల్యం 10 శాతం, కోల్‌కతాలో 12 శాతం, చెన్నైలో 18 శాతంగా ఉన్నాయి. హైదరాబాద్‌ సిటీలో 8 శాతం మాత్రమే రోడ్లున్నాయి. హైదరాబాద్​లో ఉన్న వాహనాల సంఖ్యను బట్టి ఇక్కడ 20 శాతం వైశాల్యంలో రోడ్లు ఉండాలి.

సిటీలో రెగ్యులర్ ట్రాఫిక్ తో పాటు వీఐపీల రాకపోకలు పెరిగిపోయాయి. ఆ సమయాల్లో ట్రాఫిక్​ మేనేజ్​మెంట్​ పక్కాగా ఉండాలి. చాలా సేపు వాహనాలను ఆపేస్తుండటం, ఒక్కసారిగా వదలడం ఇబ్బందులకు కారణమవుతోంది.

ఇటీవల సిటీలో క్యాబ్​ల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఒక్క శంషాబాద్‌ ఎయిర్​పోర్టుకే ప్రతిరోజు సుమారు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉబెర్, ఓలా మొబైల్‌ యాప్‌ల నుంచి రోజూ సుమారు 15 లక్షల మంది క్యాబ్స్ బుక్‌ చేసుకుంటున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు లక్షన్నర ఆటోలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఇవి ట్రాఫిక్​ పెరగడానికి కారణమయ్యాయి.

సిటీలో చాలా చోట్ల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్య. దాంతో జనం రోడ్ల పక్కనే వాహనాలు పార్క్​ చేస్తున్నారు. షాపింగ్​ మాల్స్, సూపర్​ మార్కెట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్​ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లో ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంది.

మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గలేదు. మెట్రో స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు సరైన కనెక్టివిటీ లేకపోవడం, మెట్రో రైలు చార్జీలు ఎక్కువగా ఉండటం దీనికి కారణమని అంటున్నారు. అయితే సిటీలో ట్రాఫిక్​ సమస్య పెరగడంతో కొద్దిరోజులుగా మెట్రోకు ప్రయాణికులు పెరుగుతున్నారు.

గంటకు 12 కిలోమీటర్లే..

గ్రేటర్‌ పరిధిలో మొత్తం 221 జంక్షన్లు ఉన్నాయి. రెగ్యులర్ గా రద్దీగా ఉండేవి 111. సిటీ కిలోమీటరుకి యావరేజ్ గా 723 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనిలో మనం దేశంలోనే రెండో ప్లేస్​లో ఉన్నం. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ టైమ్ లో వాహనాల సగటు స్పీడు గంటకు 12 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఢిల్లీ 26.5 కిలోమీటర్లు , ముంబైలో 21.6 కి.మీ, పుణెలో 21.9 కి.మీ, బెంగళూరులో 20.4, కోల్ కతాలో 20.02, చెన్నైలో 19.06 కిలోమీటర్లుగా ఉండటం గమనార్హం.

చినుకుపడితే అంతే..

సిటీలో ఏ కొంచెం వానపడినా ట్రాఫిక్​ ఎక్కడిక్కడ ఆగిపోతోంది. రోడ్లు సరిగా లేకపోవడం, వాటర్​ ల్యాగింగ్​ పాయింట్లే దీనికి కారణం. సిటీలో ఏడాది పొడవునా ఏదో ఓ చోట రోడ్ల రిపేర్లు ఉంటున్నాయి. డ్రైనేజీ కోసం, కేబుళ్లు, పైప్​లైన్లు వేయడం కోసమంటూ రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. ఇది సమస్యను మరింతగా పెంచుతోంది. ప్రధాన రోడ్లనే చూస్తే పాత్ హోల్స్ (గుంతలు) 191, పాడైన రోడ్లు 172 , వాటర్ లాగింగ్ పాయింట్స్ 116 ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఇలాంటి చోట్ల ట్రాఫిక్​ నరకమే.

సర్వేలు హెచ్చరించినా..

సిటీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సర్వేలు చేశారు. సూచనలు స్వీకరించారు. కానీ వాటిని అమల్లోకి తేలేకపోయారు. 29 ఏళ్ల కింద వరంగల్‌ ఎన్‌ఐటీ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏడాది పాటు హైదరాబాద్​లో పర్యటించి నివేదిక ఇచ్చింది. రోడ్లను విస్తరించాలని, రామచంద్రాపురం, మేడ్చల్‌, ఘట్కేసర్‌, రాజేంద్రనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మూసీపై మరో ఐదు వంతెనలు నిర్మించాలని సూచించింది. తర్వాత 2013లో లీ అసోసియేట్స్​అనే సంస్థతో సర్వే చేయించారు. 2041 నాటికి హెచ్‌ఎండీఏ పరిధిలో జనాభా 1.9 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కాలనీ రోడ్లను ప్రధాన రహదారులకు ఎలా అనుసంధానం చేయొచ్చో సూచించింది. ఓఆర్​ఆర్​ వెంబడి బస్​ రాపిడ్​ ట్రాన్స్​పోర్టు సిస్టం ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ చాలా వరకు అమలు కాలేదు.

అర కోటి దాటిన వెహికిల్స్..

సిటీ విస్తరిస్తున్నట్టుగానే వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. రవాణా శాఖ లెక్కల ప్రకారం 1970లో వ్యక్తిగత వాహనాలు 9,789, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కి 5,083 వాహనాలు మాత్రమే ఉండేవి. ఇది 1990 నాటికి రెండున్నర లక్షలకు, 2012 నాటికి 36.72 లక్షలకు చేరింది. 2017లో వాహనాల సంఖ్య 50 లక్షలు దాటింది. ప్రస్తుతం సిటీ పరిధిలో 35 లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు, 14 లక్షల కార్లు, 8 లక్షల రవాణా వాహనాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

ఐటీ కారిడార్​లో యూటర్నుల తలనొప్పి..

హైటెక్​సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలతో కూడిన ఐటీ కారిడార్​లో ట్రాఫిక్​ ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శిల్పారామం వద్ద ఉన్న వాటర్​ ల్యాగింగ్​ పాయింట్, ఐకియా జంక్షన్​ వద్ద, హైటెక్స్, కొండాపూర్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్​ వైపు వెళ్లే రూట్లలోని యూటర్నుల వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆయాచోట్ల రోడ్డు ఇరుగ్గా ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఇక వర్షం పడిందంటే.. కొత్తగూడ బస్టాప్, శిల్పారామం ఎదురుగా ఉన్న ఏసీ బస్టాప్​ ముందున్న ప్రాంతం, కొత్తగూడ సిగ్నల్, గచ్చిబౌలిలోని రాడిసన్​ హోటల్​ ముందు రోడ్డు, గచ్చిబౌలి టీసీఎస్​ కార్యాలయం, బయో డైవర్సిటీ జంక్షన్, డీఎల్​ఎఫ్​ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుంది. శుక్రవారం భారీ ట్రాఫిక్​ జామ్​కు ఇదే కారణం.