నవీపేట్, వెలుగు : కూతురు పెండ్లి చేసిన తర్వాత కొద్ది సేపటికే తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నందిగామలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీకాంత్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నందిగామ గ్రామానికి చెందిన ఎల్క దేవన్న (51)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు ప్రవళిక పెండ్లిని ఆదివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన శివకుమార్‌తో జరిపించారు.
తర్వాత దేవన్న బంధువులతో కలిసి ఇంటికి వెళ్లాడు. ‘గొర్రెలు అమ్మి కూతురి పెండ్లి చేశాను.. ఇక ఎలా బతకాలి’ అంటూ బంధువుల వద్ద వాపోయాడు. తర్వాత గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూసే సరికే చనిపోయి కనిపించాడు. దేవన్న భార్య రాజుబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

