పెళ్లిరోజే విషాదం.. పెళ్లికొడుకు తండ్రి, నానమ్మ మృతి

 పెళ్లిరోజే విషాదం.. పెళ్లికొడుకు తండ్రి, నానమ్మ మృతి
  • పెళ్లయిన కొద్ది గంటలకే విషాద ఘటనలు
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెళ్లికొడుకు నానమ్మ మృతి.. 
  • తన తల్లి మృతిని చూసి తట్టుకోలేక పెళ్లికొడుకు తండ్రి వెంకటస్వామి గుండెపోటుతో మృతి

అనంతపురం: పెళ్లి తంతు చాలా సంతోషంగా ముగిసిందన్న ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెళ్లికొడుకు నానమ్మ మృతి చెందింది. నానమ్మను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన పెళ్లి కొడుకు తండ్రి కూడా గుండెపోటుతో ఆస్పత్రిలోనే కుప్పకూలి చనిపోయాడు. కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషాద ఘటన రెండు కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఈ విషాదం చోటుచేసుకుంది. 
ఇవాళ ఆదివారం.. ఉదయం పెళ్లి తంతు ముగిసే ఈ రోజు ఉదయం వరకు పెళ్లి భాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా పామిడి పోలీసు స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటస్వామి తన కుమారుడి పెళ్లిని వైభవంగా జరిపించాడు. తనకున్నంతలో బంధుమిత్రులు, ఒకనాటి పై అధికారి అయిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సహా పరిచయం ఉన్న రాజకీయ నేతలందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. పెళ్లి బాగా జరిగిందన్న ఆనందంలో మునిగి తేలుతుండగా.. ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వెంకటస్వామి తల్లి కోనమ్మ (70) చికిత్స ఫలించక కన్ను మూసింది. తల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన వెంకటస్వామి కళ్ల ముందే తల్లి చనిపోవడంతో తట్టుకోలేక పోయాడు. గుండెపోటుతో ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. వైద్యులు గుర్తించి చికిత్స ప్రారంభించేలోగానే కన్నుమూశాడు. పెళ్లికొడుకు తండ్రి, నానమ్మల మరణవార్తతో  పెళ్లి కుటుంబాలు  శోకసంద్రంలో మునిగిపోయాయి. 
కొడుకు అక్షింతలు వేసి ఆశీర్వదించి.. ఆ తర్వాత తండ్రి భౌతికకాయానికి నివాళులు
తన వద్ద హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన అనుబంధంతో పెళ్లికి హాజరైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పెళ్లింట ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. పెళ్లి జంటకు అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లిన కొన్నిగంటల్లోనే పెళ్లికొడుకు తండ్రి, నానమ్మలు చనిపోయారన్న విషయం తెలిసి మళ్లీ తిరిగొచ్చి భౌతిక కాయానికి నివాళులర్పించారు. బంధుమిత్రులందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఆనందకర ఘటనల్లో పాలుపంచుకున్నారన్న సంతోషం... ఆ వెంటనే అదే కుటుంబంలో చోటు చేసుకున్న విషాదఘటనకు హాజరుకావాల్సి రావడం..  రెండు సంఘటనలు  తలచుకుని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పామిడి పోలీసు స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటస్వామి తాను అనంతపురం వన్ టౌన్ సీఐగా ఉన్నప్పుడు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడని.. అప్పటి నుండే ఆయనతో ఆత్మీయ బంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వెలుగు తర్వాత చీకటి.. సంతోషం  వెంటే దుఃఖం ఉండడమంటే ఇదేనేమో, ఇలాంటి విషాద సందర్భం ఎవ్వరికీ రాకూడదు అంటూ రెండు కుటుంబాలను ఓదార్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ను చూసిన వెంకటస్వామి భార్య.. ఒరే.. మాధవ్ సార్ వచ్చాడు రా.. మీ నాన్నకు ఫోన్ చేయండి.. ఎక్కడున్నా వెంటనే వస్తాడంటూ రోదించడం అందర్నీ కంటతడిపెట్టించింది.