మంచిర్యాలలో లారీని ఢీ కొట్టిన ఆటో ..స్పాట్ లోనే ముగ్గురు మృతి

మంచిర్యాలలో లారీని ఢీ కొట్టిన  ఆటో ..స్పాట్ లోనే ముగ్గురు  మృతి

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్పూర్ సమీపంలోని నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది

పోలీసుల వివరాల ప్రకారం.. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. నస్పూర్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తుండగా ఆటో లారీని  ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జైంది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను మందమర్రి మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న నస్పూర్ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.