ఇయ్యాల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్​పై ట్రైనింగ్

ఇయ్యాల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్​పై ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ శాఖలో అవకతవకలపై అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్​ నేతలకు గట్టి కౌంటర్  ఇచ్చేలా తమ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్​ పార్టీ సిద్ధం చేస్తున్నది. ఇరిగేషన్​ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన కల్పించేందుకు పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా ఒకరోజు ట్రైనింగ్​ ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం ప్రజా భవన్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలందరికీ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సమగ్రంగా వివరించనున్నారు.

కేఆర్ఎంబీ గురించి కూడా పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలకు ఇప్పటికే వివరించారు. బడ్జెట్​పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఇరిగేషన్ పై మరోసారి వైట్​పేపర్​ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్​ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తదితరులు నిర్ణయించినట్లు తెలిసింది.