సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు
  • ఇయ్యాల షెడ్యూల్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ
  • నెల రోజుల పాటు సాగనున్న ప్రక్రియ
  • ట్రాన్స్‌‌ఫర్లకు సెప్టెంబర్ 1కి కటాఫ్ తేదీ మార్పు
  • ఇప్పటికే 74 వేల అప్లికేషన్లు.. మరో ఐదారు వేలు పెరిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ఈ నెల 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన రీషెడ్యూల్​ను శుక్రవారం రిలీజ్ చేయనుంది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కొత్త షెడ్యూల్ రెడీ చేశారు. దీన్ని సర్కారు ఆమోదానికి గురువారం పంపించారు. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 3 దాకా ఈ ప్రక్రియ నిర్వహించేలా ప్లాన్ చేశారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలుకాగా, అప్పట్లోనే 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేయడంతో మధ్యంతరంగా ఆగిపోయింది. ఆగిపోయిన ఆ ప్రాసెస్​ను మళ్లీ కొనసాగించేలా షెడ్యూల్ రూపొందించారు. సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో కొత్తగా దరఖాస్తులను స్వీకరించడంతో పాటు గతంలో అప్లై చేసిన వారికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. కొత్తగా మరో ఐదారు వేల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. 2015లో బదిలీ అయిన టీచర్లు, 2018లో బదిలీ అయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఏకకాలంలో జరననున్నది. సుమారు 50 వేల మంది టీచర్లు తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు మారనున్నారు.

9,979 మందికి ప్రమోషన్లు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఒకసారి ప్రమోషన్లు ఇచ్చారు. 2018లో కేవలం బదిలీలు మాత్రమే నిర్వహించారు. ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 9,979 మంది టీచర్లకు ప్రమోషన్లు రానున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ల ద్వారా 1,947 గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుండగా, 2,162 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్, 5,870 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముందుగా హెడ్మాస్టర్లకు బదిలీలు నిర్వహించి, ఆ తర్వాత మిగిలే ఖాళీలను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేస్తారు.

ఇవీ మార్పులు, చేర్పులు

  • ఇది వరకు ఫిబ్రవరి 1, 2023 కటాఫ్ తేదీగా ఉండగా.. ప్రస్తుతం దాన్ని సెప్టెంబర్ 1, 2023కు మార్చనునున్నారు.
  • లాంగ్ స్టాండింగ్‌‌లో 8 ఏండ్ల సర్వీస్ పూర్తయిన టీచర్, ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన హెడ్మాస్టర్ స్థానాలను ఖాళీగా చూపిస్తారు.
  • రిటైర్‌‌‌‌మెంట్‌‌కు మూడేండ్ల లోపు సర్వీస్ ఉన్న టీచర్లు, హెడ్మాస్టర్లకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.
  • ఇదివరకు టీచర్ యూనియన్ నేతలకు పది పాయింట్లు ఉండగా, దాన్ని తొలగిస్తారు. స్పౌజ్ టీచర్లకు పది పాయింట్లు కంటిన్యూ చేస్తారు.
  • కొత్త దరఖాస్తులకు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్‌ చేసుకునేందుకు చాన్స్‌ ఇస్తారు.