ఎస్ఎస్ఏలో బదిలీలు లేనట్టేనా

ఎస్ఎస్ఏలో బదిలీలు లేనట్టేనా

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్ఎస్ఏ)లో ఏండ్ల నుంచి ట్రాన్స్​ఫర్లు లేక ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతున్నారు. కొత్తజిల్లాలు ఏర్పడిన తర్వాత సొంత జిల్లాలను వీడి వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్​ను 317 జీవోతో  సొంత జిల్లాలకు అలాకేట్ చేశారు. కానీ కాంట్రాక్టు ఎంప్లాయీస్​కు బదిలీలు నిర్వహించకుండానే, కొత్త పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు మొదలుపెట్టారు. దీంతో ఏండ్ల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

కరోనాతో బ్రేక్ 

రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎస్ఏ ప్రాజెక్టులో18 వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్​ పనిచేస్తున్నారు.2015లో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు కావడంతో ఆర్డర్ టూ సర్వ్ కింద చాలామంది సొంతజిల్లాలు వదిలి ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చేది తక్కువ జీతమే అయినా, భవిష్యత్​లో తిరిగి తమ సొంత ప్రాంతానికి వస్తామనే ధీమాతో వర్క్ చేస్తున్నారు. ఇటీవల జీవో317తో టీచర్లను సొంతజిల్లాకు ట్రాన్స్​ఫర్ చేసినట్టు తమనూ చేస్తారనే ఆశలో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియే మొదలు కాలేదు. అయితే మూడేండ్ల కింద ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్​కూ ట్రాన్స్​ఫర్లు నిర్వహించాలని అధికారులు భావించి, ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్​నూ రూపొందించారు. కానీ కరోనా రావడంతో ఆ ప్రక్రియంతా ఆగిపోయింది.  

చివరి నిమిషంలో వెనక్కి 

2019 నవంబర్​లో కొత్త మండలాలు, జిల్లాల్లో పనిచేసేందుకు 704 పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించి, అప్పట్లోనే రిజల్ట్ ఇచ్చారు. అయితే ఆ పోస్టులను ఇటీవల భర్తీ చేసేందుకు ఎస్ఎస్ఏ అధికారులు ఏర్పాట్లు చేసి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తాజాగా కేజీబీవీల్లోనూ వెయ్యిపోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నరు. అయితే తమకు ముందు బదిలీలు నిర్వహించిన తర్వాతే కొత్త పోస్టులను భర్తీ చేయాలని ప్రస్తుతం పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోరుతున్నారు. దాదాపు 10–12 ఏండ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నవారూ ఉన్నారు.