నగదు రహిత ట్రీట్మెంట్పై అవగాహన కల్పించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

 నగదు రహిత ట్రీట్మెంట్పై అవగాహన కల్పించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • ఆర్టీఏ మెంబర్ల సమావేశంలోమంత్రి పొన్నం ప్రభాకర్​ 

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగదు రహిత ట్రీట్​మెంట్​పై జనాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ మెంబర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన అన్ని జిల్లాల ఆర్టీఏ మెంబర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో వారిని ఆదుకునేందుకు కేంద్రం ఒక్కో బాధితుడికి 8 రోజుల పాటు ట్రీట్​మెంట్​కు లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. ఇది చాలా మందికి తెలియదని, అన్ని జిల్లాల్లో  గ్రామీణ స్థాయిలో జనాలకు దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని ఆర్టీఏ మెంబర్లకు మంత్రి సూచించారు. 

ఇటీవల కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరుపై మంత్రి వారికి వివరించారు. జిల్లాల్లో రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి స్కూల్, కాలేజీల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించాలని, గ్రామాల్లో ర్యాలీలు తీయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే నెలను రోడ్ సేఫ్టీ మంత్ గా నిర్వహిస్తున్నందున డిసెంబర్ లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పల్లె నుంచి పట్నం వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.