IND vs AUS: ఓపెనర్‌గా మాథ్యూ షార్ట్.. టీమిండియాతో చివరి రెండు టీ20లకు హెడ్ దూరం

IND vs AUS: ఓపెనర్‌గా మాథ్యూ షార్ట్.. టీమిండియాతో చివరి రెండు టీ20లకు హెడ్ దూరం

టీమిండియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి రెండు మ్యాచ్ లకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరమయ్యాడు. నవంబర్ 21 నుంచి జరగనున్న యాషెస్ కు సిద్ధమవ్వడానికి హెడ్ ను ఆస్ట్రేలియా టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. యాషెస్ కు ముందు ప్రాక్టీస్ లో భాగంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ ఆడాలని హెడ్ నిర్ణయించుకున్నాడు. హోబర్ట్‌ వేదికగా టాస్మానియాతో జరిగే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో హెడ్ సౌత్ ఆస్ట్రేలియా తరపున ఆడనున్నట్టు తెలిపాడు. జూలైలో వెస్టిండీస్ లో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తర్వాత హెడ్ ఆడుతున్న తొలి రెడ్ బాల్ సిరీస్ ఇది. 

హెడ్ ​​అందుబాటులో లేకపోవడంతో చివరి రెండు టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు మాథ్యూ షార్ట్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైట్ బాల్ క్రికెట్ లో ఓపెనింగ్ చేసే హెడ్.. టెస్ట్ క్రికెట్ లో ఐదో స్థానంలో బ్యాటింగ్ ఆడతాడు. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ యాషెస్ సన్నాహకాల్లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడి చివరి మూడు టీ20 లకు దూరమయ్యాడు. పని భారం కారణంగా హేజల్ వుడ్ కు క్రికెట్ ఆస్ట్రేలియా రెస్ట్ ఇచ్చింది. త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం ఈ స్టార్ పేసర్ ను ఫ్రెష్ గా ఉంచాలని ఆసీస్ భావిస్తోంది. 

ఆడమ్ జంపా అందుబాటులో ఉండడంతో లెగ్-స్పిన్నర్ తన్వీర్ సంఘాను జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఈ లెగ్ స్పిన్నర్ డొమెస్టిక్ క్రికెట్ లో న్యూ సౌత్ వేల్స్ తరపున వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. సీమర్ బెన్ ద్వార్షుయిస్ గాయం నుంచి కోలుకొని ఆసీస్ జట్టులో చేరాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నవంబర్ 6 న నాలుగో టీ20, నవంబర్ 8న చివరిదైన ఐదో టీ20 జరుగుతుంది. 

టీమిండియాతో చివరి రెండు టీ20 మ్యాచ్ లకు ఆస్ట్రేలియా జట్టు: 

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, గ్లెన్ మాక్స్వెల్, మహ్లి బియర్డ్‌మాన్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మాథ్యూ షార్ట్, బెన్ డ్వార్షుయిస్, ఆడమ్ జంపా