
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి మెరుగుపరుస్తున్నరు
- చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నం
- ఎన్నికల్లో లబ్ధి కోసం గత పాలకులు హడావుడిగా శంకుస్థాపలు
- క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.2.33 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్, వెలుగు : బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, గత పాలకుల తప్పిదాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి, ఎస్‌డీఎఫ్ ఫండ్స్ రూ.2.33 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వివేక్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి.
ప్రజలు కనీస అవసరాల కోసం గోసపడ్డారు. క్యాతనపల్లిలో వరద కాలువలు, సైడ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత పాలకులు ప్రచారానికి ముందు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. ఎంపీ ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి పనులు ఆగిపోయినా.. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. కోడ్తర్వాత నుంచి అభివృద్ధి పనులు చేపడుతున్నాను. రెండ్రోజుల్లో నియోజకవర్గం పరిధిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను”అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పర్యటించిన వివేక్ వెంకటస్వామి మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్‌తో కలిసి రామకృష్ణాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ విద్యార్థులు, బోధన సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్‌లో కిచెన్ రూమ్ లేదని, టాయిలెట్స్ సరిపోవడం లేదని, స్కూల్ భవనం రూఫ్ పగిలిపోవడంతో వర్షపు నీరు క్లాస్ రూముల్లోకి రావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
ఇందుకు స్పందించిన వివేక్.. డీఎంఎప్‌టీ ఫండ్స్ నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. అనంతరం సింగరేణి జీఎం స్కూల్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. మున్సిపాలిటీలోని జ్యోతి నగర్‌లో పట్టణ ప్రగతి ఫండ్స్ రూ.30 లక్షలతో సైడ్ డ్రైనేజ్ పనులు, భరత్ నగర్‌లో ఎస్‌డీఎఫ్‌ఫండ్స్ రూ.60 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులు, వీఆర్ కన్వెన్షన్ పరిధిలో రూ.49 లక్షలతో సైడ్ డ్రైనేజ్ పనులు, అమ్మ గార్డెన్‌లో రూ.94 లక్షలతో చేపట్టనున్న సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అమ్మ గార్డెన్స్ యాజమాని తోట రవికుమార్ 30 రోడ్‌లో సొంతగా చేపట్టనున్న రోడ్డు పనులను వివేక్ ప్రారంభించారు. అనంతరం మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారీ మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ఫ్రెండ్ షిప్ డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే..
మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారీ వనంలో ఏర్పాటు చేసిన పట్టణ కాంగ్రెస్ బూత్ ఇన్‌చార్జిల మీటింగ్‌కు వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమాల్లో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ రమేశ్, ఏఈ అచ్యుత్, మందమర్రి సీఐ శశీధర్ రెడ్డి, ఆర్‌కేపీ ఎస్‌ఐ రాజశేఖర్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, పార్టీ లీడర్లు రఘునాథ్ రెడ్డి, ఎండీ అబ్దుల్ అజీజ్, బండి సదానందం, గోపతి రాజయ్య, ఓడ్నాల శ్రీనివాస్, మహంకాళీ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు పోలం సత్యనారాయణ, పూల్లూరి సుధాకర్ పాల్గొన్నారు.
‘హలో మాల.. ఛలో ఢిల్లీ పోరు’ పాంప్లెట్స్ ఆవిష్కరించిన వివేక్..
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 11, 12 తేదీల్లో మాల మహనాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘హలో మాల.. ఛలో ఢిల్లీ మాలల పోరు గర్జన’పాంప్లెట్స్‌ను ఆదివారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు లీడర్లతో కలిసి ఆవిష్కరిం చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రాంమూర్తి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అప్పీలు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్, జాతీయ ఉపాధ్యక్షుడు ముత్తెమాల పుల్లయ్య, కార్యదర్శి కాసర్ల యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులు గద్దల తిరుపతి, దేవరపల్లి మధుబాబు, బెడ మల్లేశం, కారం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.