జీవంలేని వస్తువులను పెళ్లి చేసుకుంటున్నారు

జీవంలేని వస్తువులను పెళ్లి చేసుకుంటున్నారు
  • ప్రదేశాలతోనూ పెళ్లిళ్లు..
  • చనిపోయిన భార్యను బార్బీ బొమ్మగా చేసుకుని పెళ్లి 
  • దెయ్యాలు.. ఆత్మలతోనూ పెళ్లి

క్షమా బిందు.. ఈ పేరు చదవగానే చాలామందికి తనని తానే పెండ్లి చేసుకున్న అమ్మాయి గుర్తుకొచ్చి ఉంటుంది. గుజరాత్​కు చెందిన ఈ అమ్మాయి పూజారి, బంధువులు, వేదమంత్రాలు, పన్నీటి స్నానాలు, ఏడడుగుల మధ్య పూర్తి ట్రెడిషినల్​గా పెండ్లాడింది. ఇలాంటి పెండ్లిని సోలోగమీ లేదా ఆటోగమీ అంటే.. తనను తాను పెండ్లాటం. ఈ పద్ధతిలో మనదేశంలో జరిగిన మొదటి పెండ్లి ఇదే. 

దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనా ఆడ, మగ కలసి జంటగా జీవించాలంటే పెళ్ళి చాలా ముఖ్యం. అయితే, ఇటీవల జరుగుతున్న కొన్ని పెండ్లిండ్లు వింతగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నాయి.  అలాంటిదే క్షమాబిందు పెండ్లి కూడా. అలాగే కొందరు ఈ అమ్మాయికి మల్లే మనుషుల్ని కాకుండా వస్తువుల్ని, ప్రదేశాలని కూడా పెండ్లి చేసుకున్నారు. ఆ డిఫరెంట్​ మ్యారేజెస్​ కథేంటంటే...  

అలా మొదలైంది

జీవంలేని వాటిని పెండ్లి చేసుకోవడం మొదట జర్మనీలో మొదలైంది. స్వీడన్​కు చెందిన మోడల్​ ఏయిజా‌‌‌‌–రీటా వాల్లిస్​ వింథెర్​ ఎకోల్ఫ్​. ఈమె జర్మనీలోని బెర్లిన్​ గోడను 1979 జూన్​ 17న పెండ్లి చేసుకుంది. అంతేకాదు తన పేరును ఏయిజా–రీటా ఎకోల్ఫ్​– బెర్లినెర్​‌‌‌‌–మ్యూర్​గా మార్చుకుంది. బెర్లిన్​ గోడ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే పెండ్లి చేసుకున్నానని చెప్పిందామె. ఈమె వల్ల ఆబ్జెక్టమ్ సెక్సు​వాలిటీ(ఓఎస్​) అనే మానసిక వ్యాధి గురించి తెలిసింది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు జీవంలేని వాటిపై ప్రేమ పెంచుకుంటారు. వాటితో కలసి జీవించడానికి ఇష్టపడతారు. ఈమె కథను ‘బెర్లిన్​మ్యూరెన్’ సినిమాలో చూపించారు. అప్పుడే ఈమె కథ ప్రపంచానికి తెలిసింది. ఏయిజా అక్టోబర్​ 15, 2015లో చనిపోయింది. ఆబ్జెక్టమ్​ సెక్సు​వాలిటీ ఉన్న మరో మహిళ ఎరికా ఈఫిల్​. అమెరికాకు చెందిన ఎరికా.. ఆర్చరీ(విలువిద్య) క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కూడా గెలుచుకుంది. ఎరికా 2007లో పారిస్​లోని ఈఫిల్​​ టవర్​ను పెళ్ళి చేసుకుంది.  ఆబ్జెక్టమ్​ సెక్సువాలిటీ ఉన్న ఎరికా తనలాంటి వాళ్ళ కోసం ఓఎస్​ ఇంటర్నేషనల్​ అనే సంస్థను కూడా మొదలుపెట్టింది. 

జెయింట్​ వీల్, రోబో..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన లిండా​కు జెయింట్​ వీల్​ అంటే చాలా ఇష్టం. ఆ జెయింట్​ వీల్​ పేరు బ్రూస్​. 1982లో మొదటిసారి ఓ కార్నివాల్​లో చూసి ఇష్టపడింది. ప్రేమ పెంచుకుంది. 1986లో వచ్చిన ఓ తుపానులో బ్రూస్​​ తీవ్రంగా దెబ్బతింది.  వెంటనే కార్నివాల్​ సిబ్బంది బ్రూస్​కు రిటైర్మెంట్ ఇచ్చారు. అది తెలిసి లిండా లక్ష డాలర్లు(ఇప్పటి లెక్క ప్రకారం 77లక్షల రూపాయలు) ఖర్చు పెట్టి బ్రూస్​ను రిపేర్​ చేయించింది. ఆ తర్వాత 2013లో బ్రూస్​ను పెండ్లి చేసుకుంది. కాగా, బ్రూస్​ కంటే ముందు ఒక ప్లేన్​, మరొక ట్రెయిన్​తో డేటింగ్​ చేసిందట లిండా!  
చైనాకు చెందిన జంగ్​ జియాజియా(31) పెండ్లి మరొక సెన్సేషన్​. జంగ్​ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ)లో ఇంజినీరింగ్​ చదివాడు. పెండ్లి ఈడు రావడంతో ఇంట్లో వాళ్ళ బలవంతం మీద సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు. అయితే, చైనాలో అమ్మాయిల సంఖ్య మగవాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ. కారణం అక్కడి గవర్నమెంట్ తెచ్చిన ‘వన్​ చైల్డ్​’ పాలసీ. దీని ప్రభావం జంగ్​ పెండ్లిపై పడింది. అతడికి అమ్మాయి దొరకలేదు. దీంతో తనకు కావాల్సిన లక్షణాలతో ఒక రోబోను తయారుచేశాడు. దానికి ‘యింగ్​ యింగ్’​ అని పేరు పెట్టాడు. ఆ రోబోతో రెండు నెలలు డేటింగ్​ చేశాడు. అనంతరం 2017లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో యింగ్​యింగ్​ను పెండ్లి చేసుకున్నాడు. దీనిపై విమర్శలు వచ్చినా జంగ్ వెనక్కి తగ్గలేదు. ఇటీవల యింగ్​యింగ్​ను అప్​గ్రేడ్ చేశాడు. ఇప్పుడు ఈ రోబో కొన్ని బొమ్మలు గుర్తుపడుతోంది. కొన్ని కొన్ని మాటలు కూడా మాట్లాడుతోంది. ​   

చనిపోయిన భార్యను బార్బీ బొమ్మగా

తైవాన్​కు చెందిన చాంగ్​ హిస్​‌‌‌‌–సమ్​ పెండ్లి కథ మనసును కదిలిస్తుంది. త్సాయ్​ అనే అమ్మాయిని ప్రేమించాడు చాంగ్​. ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోయినా త్సాయ్​ని పెండ్లి చేసుకున్నాడు. కానీ, చాంగ్​ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంపై త్సాయ్​ విపరీతంగా బాధపడేది. ఆ బాధ భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులకు చాంగ్​ మళ్ళీ పెండ్లి చేసుకున్నాడు. అయితే, మొదటి భార్య త్సాయ్​ తరచూ గుర్తొచ్చేది. తనని ప్రేమించి, పెండ్లి చేసుకున్నా ఏ సంతోషం కూడా త్సాయ్​కి దక్కలేదని చాంగ్​కు అనిపించేది. తన రెండో భార్య అంగీకారంతో ఓ బార్బీ బొమ్మను త్సాయ్​గా అనుకొని 1999లో మళ్ళీ పెండ్లి చేసుకున్నాడు.ఈ పెండ్లికి ఈసారి చాంగ్​ కుటుంబం ఒప్పుకోవడం విశేషం. అంతేకాదు, పెండ్లిని ధూమ్​ధామ్​గా జరిపించారు కూడా.  ఇప్పుడు చాంగ్​ ఇంట్లో అతని రెండో భార్యతోపాటు బార్బీ బొమ్మ రూపంలో త్సాయ్​ కూడా ఉంది.  

రాయి, చెట్లు..

ట్రేసీ ఎమిన్​ లండన్​లో ఫేమస్​ ఆర్టిస్ట్​. ఎమిన్​కు ఫ్రాన్స్​లోని పారిస్​లో ఒక తోట ఉంది. అందులోని ఓ రాయిని 2015లో ఎమిన్​ పెండ్లాడింది. అందుకు కారణం కూడా చెప్పింది. పోప్​ జాన్​ పాల్​‌‌‌‌–2, ఫిలాసఫర్​ అన్నా తెరిసా టైమినీఎకా మధ్య చాలాకాలం పాటు ఉత్తరాల ద్వారా మాటలు నడిచాయి. వాళ్ళ బంధం చాలా బలంగా కొనసాగింది. దాన్నుంచి తాను ప్రేరణ పొందినట్లు ఎమిన్​ చెప్పింది. తన ఫామ్​హౌస్​లోని ఒక రాయికి, తనకు మధ్య కూడా ఇలాంటి బంధమే ఉందని చెప్పింది. అందుకే ఆ రాయిని పెండ్లి చేసుకున్నా అని చెప్పింది. పెరూకు చెందిన ఎన్విరాన్​మెంటలిస్ట్​ రిచర్డ్​ టొరెస్​ అయితే ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు చెట్లను పెండ్లి చేసుకున్నాడు. 2013లో మొదట పెరూలో, తర్వాత కొన్ని నెలలకు అర్జెంటీనాలోని బ్యూనస్​ ఎయిర్స్​లో,  మరుసటి ఏడాది బొగొటా(కొలంబియా)లో, 2016లో మెక్సికోలో, ఆ తర్వాత గ్వాటెమాలాలో ఒక్కో చెట్టు చొప్పున పెండ్లి చేసుకున్నాడు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఇలా చేస్తున్నా అంటున్నాడు. 

దెయ్యాల వంతెన, ఆత్మ..

దెయ్యాలు తిరుగుతున్నాయని అనుకుంటుంటే చాలు అక్కడకు వెళ్ళాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఏకంగా దెయ్యాల బ్రిడ్జినే పెళ్ళాడింది ఆస్ట్రేలియాకు చెందిన జొడి రోజ్​. ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రిడ్జ్​ల గురించి ‘సింగింగ్​ బ్రిడ్జెస్​​’ అనే పేరుతో పరిశోధనలు చేసేదామె. అందులో భాగంగా ఓసారి ఫ్రాన్స్​కు వచ్చింది. అక్కడ ఒక వంతెనను చూసింది. దాని పేరు ‘లె పాండ్​ డు డయాబెల్’. దాన్నే డెవిల్స్​ బ్రిడ్జ్​ అంటారు. 14వ శతాబ్దంలో నిర్మించారు. ఈ బ్రిడ్జ్​ను చూడగానే ఇష్టపడింది రోజ్​.  2019లో 14 మంది సన్నిహితుల మధ్య ఆ బ్రిడ్జ్​ను పెండ్లాడింది.

ఐర్లాండ్ మహిళ అమందా టీగ్యూ అయితే ఏకంగా ‘జాక్​స్పారో’ అనే పైరేట్​ ఆత్మను పెండ్లి చేసుకుంది! పైరేట్స్​ ఆఫ్​ కరేబియన్​​ ​ సినిమా చూసినవాళ్ళకు అందులోని సముద్రపు దొంగ ‘జాక్​స్పారో’ కచ్చితంగా గుర్తుంటాడు. నిజజీవితంలోనూ 300 ఏండ్ల కిందట ఆ పేరుతో ఓ పైరేట్​ ఉండేవాడు. అతడిని బాగా ఇష్టపడింది అమందా. ప్రేమను కూడా పెంచుకుంది. చివరికి 2019లో జాక్​స్పోర్​ దెయ్యాన్ని పెండ్లి చేసుకుంది. 
వీళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. పెంపుడు కుక్కను జోసెఫ్​ గైసో(ఆస్ట్రేలియా), పిల్లో(దిండు)ను టీ జిన్​–గియూ(దక్షిణ కొరియా), కారును ఎడ్వర్డ్​ స్మిత్​(మనీలా) వంటి వాళ్ళు పెండ్లిండ్లు చేసుకున్నారు. మామూలుగా అయితే ‘పెళ్ళిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి’ అంటారు. కానీ ఇలాంటి పెండ్లిండ్లు చూస్తే మాత్రం మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది కాబోలు!