కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరించాలె: ట్రెసా

కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరించాలె: ట్రెసా
  •     భూ రికార్డుల నిర్వహణ డీసెంట్రలైజ్ చేయాలె: ట్రెసా 
  •     రెవెన్యూ ఉద్యోగుల సదస్సులో 9 తీర్మానాలకు ఆమోదం 
  •     రైతులకు ఇబ్బందులు రానీయొద్దు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరించి భూ రికార్డుల నిర్వహణను డీసెంట్రలైజ్​ చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) డిమాండ్ చేసింది. రైతుల సమస్యలు, ప్రయాసలను తొలగించేందుకు అప్పీలేట్ అథారిటీని నియమించాలని, ప్రజలకు సేవలు ఫాస్ట్​గా అందేలా, రెవెన్యూ ఉద్యోగుల ఇబ్బందులను తొలగించేలా మార్పులను చేయాలని కోరింది. 

శనివారం తూంకుంటలో ట్రెసా ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల సదస్సును నిర్వహించారు. సదస్సుకు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం హాజరు కాగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సందేశాన్ని పంపించారు. సదస్సులో మొత్తం 9 తీర్మానాలను ఆమోదించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు, పట్టాదారులు, రెవెన్యూ ఉద్యోగులు చాలా కష్టాలు పడ్డారని పొంగులేటి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు సమర్థంగా పని చేసి రైతులు, పట్టాదారుల ఇబ్బందులను తొలగించాలని సూచించారు.

 రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కోదండరాం చెప్పారు. అస్తవ్యస్తమైన భూరికార్డుల నిర్వహణలో మార్పులు తేవాలని సూచించారు. సదస్సులో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు పడిగెల రాజ్‌‌కుమార్, ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి సహా 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సహా రెండు వేలకుపైగా రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.