వందల ఎకరాల్లో వరి.. వర్షపు నీటితోనే సాగుబడి

వందల ఎకరాల్లో వరి.. వర్షపు నీటితోనే సాగుబడి

ఆ భూముల్లో బోరుబావుల్లేవు.. కాలువలు, చెరువులు అంతకన్నా లేవ్. అసలు సాగునీటి సౌకర్యమే లేదు. అయినా.. వరి సిరులు పండిస్తున్నారు. అదేంటి చాలా ఎక్కువ నీళ్లుంటేనే వరి పండుతుంది కదా అంటారా? కానీ, ఇక్కడ కేవలం వర్షపు నీటితోనే వరి పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన రైతులు. అదెక్కడ? ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి..

 మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని గిరిజన గ్రామాల్లో చాలా మంది రైతులు వందలాది ఎకరాల్లో వరి పండిస్తున్నారు. వానదేవుడిపై నమ్మకంతో ప్రతిసారి పంట వేస్తున్నారు. ముఖ్యంగా కొర్లకుంట, లంబాడిపల్లి, దొబ్బలపహడ్, పెగడపల్లి, మాదారం, సింగంపల్లి, కనుకునూర్, రెడ్డిపల్లి, ఊట్లపల్లి, దౌతుపల్లి గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఈ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. తొలకరి జల్లు పలకరించగానే దుక్కులు దున్నుతారు. చిరుజల్లులు కురవగానే నారు మడులు తయారు చేసుకుంటారు. నారు ఎదిగిన 25రోజుల్లోపే నాట్లు వేస్తారు. తర్వాత కురిసే వర్షాలకు మడుల్లో నిండిన నీళ్లను ఒడిసిపడతారు. పొలం నుంచి కాసిన్ని నీళ్లు కూడా బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వర్షం కురిసినప్పటినుంచి రైతులు ఎక్కువసేపు పొలాల దగ్గరే ఉండి నీటిని కాపాడుకుంటారు.

తక్కువ టైంలో పంట..

ఇక్కడి రైతులు తక్కువ టైంలో పంట చేతికొచ్చే విత్తనాలనే చల్లుతారు. ఇవి చెరువులు, కుంటలు, కాల్వలు, బోరుబావుల కింద సాగయ్యే వరి విత్తనాల కన్నా 15 నుంచి 20 రోజుల ముందే కోతకొస్తాయి. దాంతో దసరా, దీపావళి మధ్య పంట చేతికొస్తుంది. అంటే పెద్దగా వర్షాలు పడకపోయినా అంత నష్టం ఉండదు.

తరతరాల నుంచి..

ఇలా వర్షంపై ఆధారపడి సాగు చేయడం ఇప్పుడు చేస్తున్నదేం కాదు. తరతరాలుగా సాగు చేస్తున్నారు ఇక్కడివాళ్లు. రసాయన ఎరువులు కూడా చాలా తక్కువగా వాడతారు వీళ్లు. ఎక్కువగా పేడను ఎరువుగా వాడతారు. అందుకే నీళ్లు తక్కువగా ఉన్నా ఎక్కువ దిగుబడి వస్తుందంటున్నారు వాళ్లు. ఎకరాకు 25 -–30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

కలిసొచ్చిన కాలం

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులకు కలిసొచ్చింది. వర్షాకాలం ప్రారంభం నుంచే వానలు కురుస్తుండడంతో సాగు నీటికి ఢోకా లేదు. దిగుబడులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ‘పోయినేడు కంటే ఈయేడు పంట బాగా పండింది. ఈ సారి వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో నీటికి ఇబ్బందులు లేవు. మరో పదిహేను రోజుల్లో పంట కోతకొస్తుంది’ అంటున్నారు రైతులు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్యల్లా పంట చేతికొచ్చే టైంలో అడవి జంతువులు నాశనం చేయడమే. వాటి నుంచి కాపాడుకోగలిగితే చాలు. పగలు కోతులు, రాత్రి పందులు పంటను నాశనం చేస్తున్నాయి.

ముందే వేస్తం.. ముందే కోస్తం

ప్రతి ఏడాది వర్షాలతోనే వరి పండిస్తున్నం. బోరుబావులు తవ్విస్తే నీళ్లు పడలే. అందుకే వానదేవుడ్నే నమ్ముకున్నం. చాలా కుటుంబాలు ఇలానే సాగు చేస్తున్నయ్. అందరికంటే ముందు నాట్లు వేసి ముందుగానే వరి కోసుకుంటం. – రవినాయక్, లంబాడిపల్లి

నీళ్లకు ఇబ్బంది లేదు

పోయిన సీజన్ కంటే ఈసారి వానాకాలం బాగా కలిసొచ్చింది. సాగు నీటికి ఇబ్బందుల్లేకుండా   వర్షం కురవడంతో తిప్పలు తప్పినయ్. పెట్టబడులు కూడా గతంలోకంటే ఈ సారి తక్కువైనయ్.  దిగుబడులు కూడా ఎక్కువ వస్తయ్. ఈ సారి పంట చాలా బాగుంది. 15రోజుల్లో కోతకొస్తుంది. – ఆలోత్ రవినాయక్, కొర్లకుంట

వానదేవుడే ఆధారం

తరతరాలుగా వరి పంటను వానదేవుడే కాపాడుతున్నడు. వర్షాల మీదనే ఆధారపడి పండించుకుంటున్నం. తొలకరి వానలు పడ్డప్పుడు నారు చల్లుకుంటం. నారు పెరగంగనే నాటు వేసుకుంటం. ఎరువులు చాలా తక్కువ వాడుతం. పశువుల ఎరువు ఎక్కువ వేసుకుంటం. ఈ ఏడాది మా ఊళ్లో సుమారు వందకు పైగా ఎకరాల్లో సాగు చేసినం. – వాల్యా నాయక్,  లంబాడిపల్లి