బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ ఎటాక్స్కు చెక్!..ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే వందేండ్లూ హ్యాపీగా బతకొచ్చంట

బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ ఎటాక్స్కు చెక్!..ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే వందేండ్లూ హ్యాపీగా బతకొచ్చంట
  • ప్రకృతికి దగ్గరగా జీవనం.. సీజనల్​గా వచ్చే పండ్లు, కూరలే ఆహారం
  • జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, అమెరికాలోని 
  • 5 సిటీల ప్రజల జీవన విధానమే ఈ బ్లూ జోన్​
  • ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే.. వందేండ్లూ హ్యాపీగా బతకొచ్చంటున్న ఎక్స్ పర్ట్స్ 
  • గుండె జబ్బులే కాకుండా.. ఇతర ప్రాణాంతక వ్యాధులూ దరిచేరవని వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. సడన్ హార్ట్ ఎటాక్​లతో ప్రాణాలు కోల్పోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, యువతలోనూ ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. మరి, హార్ట్ ఎటాక్​లు మన దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుండె పదిలంగా ఉండి ఎక్కువ కాలం బతకాలంటే ఎలాంటి లైఫ్​స్టైల్​ను అనుసరించాలి? అంటే అందుకు ‘బ్లూ జోన్’ లైఫ్ స్టైల్ సరైన సమాధానం అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్ లు. అవును.. సహజసిద్ధమైన ఆహారం తీసుకుంటూ, ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించే ఈ లైఫ్​స్టైల్​ను తు.చ. తప్పకుండా పాటిస్తే మన గుండె దీర్ఘకాలం మంచిగ పనిచేసి సడన్ స్ట్రోక్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు. 

అంతేకాదు.. హ్యాపీగా నిండు నూరేండ్ల వరకు బతకొచ్చని అంటున్నారు. ప్రకృతికి దగ్గరగా ఉంటూ.. సీజనల్​గా వచ్చే పండ్లు, కూరలే ఆహారంగా తీసుకుంటూ సాగించే జీవన విధానమే ‘బ్లూ జోన్’ లైఫ్ స్టైల్. ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం పాటిస్తున్న విధానమే ఇది. జపాన్​లోని ఒకినవా, ఇటలీలోని సార్డీనియా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్ లోని ఇకారియా, కాలిఫోర్నియాలోని లోమా లిండా సిటీల్లోని ప్రజలు ఈ లైఫ్ స్టైల్ వల్లే అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటారట. గుండె జబ్బులే కాదు.. ఇతర జబ్బులూ వాళ్ల దరిచేరడం చాలా అరుదుగా జరుగుతుందట. ఆయా సిటీల్లోని ప్రజలు ఎక్కువ మంది వందేండ్లపాటు బతుకుతున్నారట. ప్రపంచంలోని పలువురు హెల్త్​ ఎక్స్​పర్ట్స్ ఇప్పటికే స్టడీ చేసి చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఢిల్లీలోని ఫోర్టిస్ వంటి ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు చెబుతున్నది కూడా ఇదే. ఇటీవల ఢిల్లీలో ‘బ్లూ జోన్స్ సీక్రెట్స్: హెల్దీ హార్ట్, మైండ్ అండ్​ సోల్ ఫర్ వైబ్రంట్ లాంగెవిటీ’ అనే అంశంపై ఓ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్లూ జోన్​ హ్యాబిట్స్​ను అందరూ అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యవంతులుగా కలకాలం హాయిగా జీవించొచ్చని ఈ కాన్ఫరెన్స్ లో నిపుణులు స్పష్టం చేశారు. 

వీటిని తగ్గించుకోవాలి.. 

బ్లూ జోన్​ప్రజలు మాంసం జోలికే వెళ్లరట. మటన్, ప్రాసెస్డ్ మీట్ వంటివి ముట్టుకోరట. ఒకవేళ తినాల్సి వచ్చినా నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే తింటారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా చక్కెర ఎక్కువుండే కూల్​ డ్రింక్స్, స్వీట్ల వంటివి చాలా పరిమితంగా తీసుకుంటారు. ఇక ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటివైపు అస్సలు చూడరు. పాలు, పెరుగు వంటివి తీసుకోరు. వైట్ బ్రెడ్, వైట్ రైస్ చాలా తక్కువ తింటారు. చాలా మంది ఫిట్​గా ఉండేందుకు జిమ్​లకు వెళ్తున్నారు. కానీ, బ్లూ జోన్ ప్రజలు.. రోజువారీ పనులనే వ్యాయామంగా తమ లైఫ్​స్టైల్​లో భాగం చేసుకున్నారు. నడవడం, తోట పని, వంట చేయడంతో పాటు ఇతర రోజువారీ పనులను చేయడం ద్వారానే వాళ్లు ఫిట్​గా ఉంటున్నారని చెబుతున్నారు. మనిషికి మనిషికి దూరం పెరుగుతున్న ఈ రోజుల్లో.. ఓ కమ్యూనిటీగా కలిసి బతకడమూ వాళ్ల స్పెషాలిటీ అని, అది కూడా వాళ్ల జీవితకాలం పెరగడంలో దోహదం చేస్తున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కమ్యూనిటీ లివింగ్ ద్వారా ఒత్తిడి దూరమై ప్రశాంతమైన జీవితాన్ని ఆయా నగరాల్లోని ప్రజలు గడుపుతున్నారని పేర్కొంటున్నారు.

వీటిని అలవర్చుకోవాలి.. 

బ్లూ జోన్ ప్రజలు ప్రకృతికి దగ్గరగా బతుకుతుంటారు. శారీరక వ్యాయామం దగ్గర్నుంచి.. తినే తిండిదాకా అన్నింటినీ క్రమశిక్షణతో పాటిస్తారు. వాళ్ల ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆకు కూరల వంటివి ఎక్కువగా తీసుకుంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు, కూరగాయలను.. ఆ కాలంలో తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటారు. పాలకూర, పాలకూర జాతికే చెందిన కార్డ్, క్యాబేజ్​ వంటి వాటిని అధికంగా తింటారు. ప్రొటీన్, ఫైబర్ ఉండే పప్పు ధాన్యాలు, బీన్స్ కూడా ఆహారంలో భాగం చేసుకుంటారు. వాటితో పాటు బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి అధికంగా తీసుకుంటారు. ఆరోగ్యవంతమైన కొవ్వులు, పోషకాలుండే డ్రై ఫ్రూట్స్, సహజసిద్ధంగా లభించే ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు. అప్పుడప్పుడు చేపలను ఆహారంలో భాగం చేస్తుంటారు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు.. ఎంత పడితే అంత తినరని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. కడుపును పూర్తిగా నింపేయకుండా.. రెగ్యులర్ గ్యాప్స్​తో ఆ ఫుడ్​ను తీసుకుంటుంటారని అంటున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఫుడ్ హ్యాబిట్స్​ను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.