కలెక్టరేట్​ ఎదుట గిరిజన రైతుల ఆందోళన

కలెక్టరేట్​ ఎదుట గిరిజన రైతుల ఆందోళన

మహబూబాబాద్, వెలుగు: రికగ్నిషన్​ఆఫ్​ ఫారెస్ట్​ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు ఉన్నప్పటికీ తమకు రైతుబంధు ఇవ్వడం లేదని గిరిజన రైతులు కలెక్టరేట్​ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలం చెరువు ముందు తండా, బోటి మీది తండా, కొత్తపెల్లి గ్రామాలకు చెందిన 39 మంది గిరిజన రైతులు 150 ఎకరాల విస్తీర్ణంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్నారు. అయితే ఐటీడీఏ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల తాము రైతుబంధు కోల్పోయామంటూ రైతులు బుధవారం కలెక్టరేట్​ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ నినాదాలు చేశారు.  తమ వెంట తెచ్చుకున్న భోజనం, రొట్టెలు అక్కడే తిన్నారు. ఈ సందర్భంగా రైతులు  మాట్లాడుతూ గత రబీ సీజన్​లోను ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన తమకు రైతుబంధు డబ్బులు అందాయన్నారు. ప్రతి సంవత్సరం పంట కాలంలో  ఐటీడీఏ శాఖ నుంచి అగ్రికల్చర్ శాఖకు ఆఫీసర్లు  నివేదిక పంపే సమయంలో చెరువు ముందు తండాకు చెందిన రైతుల భూముల వివరాలను హోల్డ్​లో పెడుతున్నారని ఆరోపించారు. అందువల్లే తమకు రైతుబంధు పడడం లేదన్నారు. 150 ఎకరాలకు సంబంధించి రూ.7.50 లక్షలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రైతులు అడిషనల్​ కలెక్టర్​ డేవిడ్​కు అందించారు. రెండు శాఖల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల150 ఎకరాలు  హోల్డ్​లో పెట్టడంతో సమస్య తలెత్తిందన అడిషనల్​కలెక్టర్​చెప్పారు. అగ్రికల్చర్ కమిషనర్ కు లెటర్​పంపి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

రైతు డబ్బులు కాజేసిన సిస్టం ఆపరేటర్
జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్న లక్ష్మీప్రసాద్  కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు బానోతు భద్రు రైతుబంధు డబ్బులు కాజేశాడు.  రూ.27,875 చొప్పున మూడు విడతల్లో రూ. 83,625  అతని బంధువు కల్తీ నరేశ్​బ్యాంకు ఖాతాలో వేస్తూ కాజేశాడు. విషయం బయటికి పొక్కడంతో గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.