గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్

గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్

ఖమ్మం అర్బన్, వెలుగు:

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి గిరిజన మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేశారు. బలవంతంగా తీసుకెళ్తుండగా చూసిన తండావాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. పారిపోతున్న నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి.. నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగాయి.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం భద్యాతండాకు చెందిన ఓ వివాహిత భర్తతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుకినితండా చెందిన ఇద్దరు యువకులు, హర్యాతండాకు చెందిన మరో ఐదుగురు కలిసి సుకినితండా శివారులో శుక్రవారం రాత్రి ఫుల్‌గా మందు తాగిన్రు. వివాహిత భర్త ఇంట్లో లేడనే విషయం తెలిసిన ఇద్దరు బైక్‌పై ఆమె ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి ఆమెను బెదిరించి మందు తాగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడున్న ఐదుగురితో సహా మొత్తం ఏడుగురు గ్యాంగ్‌రేప్‌ చేశారు. బైక్‌పై బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్తుండగా గమనించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్‌ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పారిపోగా ఒకరు మాత్రం చిక్కినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీసీపీ

అత్యాచారం జరిగిన స్థలాన్ని ఖమ్మం అడిషనల్ డీసీపీ ఇంజారపు పూజ శనివారం పరిశీలించారు. క్లూస్ టీమ్‌ ఆధారాలు సేకరించింది. ఘటనాస్థలంలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తరువాత రఘునాథపాలెం ఠాణాలో అడిషనల్ డీసీపీ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను అరెస్ట్​ చేస్తామన్నారు. గ్యాంగ్‌ రేప్‌ చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని సీపీఐ(మార్క్సిస్టు), డీవైఎఫ్‌ఐ, ఐద్వా, భద్యాతండా వాసులు ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. నిందితులను నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం అడిషనల్ డీసీపీకి వినతి పత్రం అందజేశారు.