గిరిజనులు పోడు మాత్రమే చేసుకోవాలె

గిరిజనులు పోడు మాత్రమే చేసుకోవాలె
  • పోడు భూములకు పట్టాలు ఇయ్యం
  • వాటిపై హక్కులన్నీ అటవీ శాఖవే: మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి
  • ఒక కుటుంబం నాలుగు హెక్టార్లకు మించి పోడు చేయొద్దు
  • గొత్తికోయలకు తెలంగాణలో గిరిజన హక్కులివ్వబోమని వెల్లడి

వరంగల్‍, వెలుగు: పోడు భూములపై వాటిని సాగు చేసే రైతులకు ఎటువంటి హక్కులు ఇవ్వబోమని వారు కేవలం సాగు చేసుకొని ఫలసాయం పొందాలని.. ఆ భూములపై పూర్తి హక్కులు అటవీ శాఖకే ఉంటాయని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‍లో.. పోడు భూములు, అడవుల పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‍ మాట్లాడుతూ.. ‘‘పోడు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు పట్టాలివ్వాలని కొందరు మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం అలా ఇవ్వదు. కేవలం పోడు, అడవులను నమ్ముకున్నవారికి న్యాయం చేస్తం. కొన్నిచోట్ల పోడు పేరుతో 40 నుంచి 50 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఇక నుంచి ఒక్కో కుటుంబానికి నాలుగు హెక్టార్లు మాత్రమే ఇవ్వాలనే రూల్ తెచ్చాం. గిరిజన కుటుంబాల పిల్లలను పెండ్లి చేసుకొని వారి పేరుతో అక్రమంగా భూములు తీసుకుంటామంటే కఠిన చర్యలు తప్పవు”అని అన్నారు. గొత్తికోయలు గిరిజనులే అయినప్పటికీ వారికి తెలంగాణలో గిరిజన హక్కులు ఇవ్వలేమని చెప్పారు. చత్తీస్‍గఢ్​లో మాత్రమే వారికి హక్కులు ఉంటాయని తెలిపారు. గిరిజనేతరులు అయితే మూడు తరాలుగా (91 ఏండ్లు) ఖాస్తులో ఉన్నట్లు ఆధారాలు చూపించాలన్నారు. గతంలోని ఆరు లక్షల ఎకరాలకు సంబంధించిన క్లెయిమ్స్ లో మూడు లక్షల ఎకరాలకు పట్టాలిచ్చినా.. ప్రస్తుతం మళ్లీ ఆరు లక్షల ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నట్లు వెల్లడించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కమిటీ వేశామని.. రిపోర్ట్​రాగానే సీఎంకు అందించి సమస్య తీరుస్తామని చెప్పారు.
అందరి సలహాలు, సూచనలు తీసుకుంటం
పోడు సమస్యను తీర్చే క్రమంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు తెలిపారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‍లో సమస్య ఎక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. పోడు సమస్యను తీర్చాలనుకోవడం కేసీఆర్‍ గొప్ప మనసుకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్‍భాస్కర్‍ అన్నారు.