కనీస సౌకర్యాలు కల్పించాలంటూ 70కిలోమీటర్లు పాదయాత్ర

కనీస సౌకర్యాలు కల్పించాలంటూ 70కిలోమీటర్లు పాదయాత్ర
  • మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలతో చాకిరేవుగూడెంలో కలెక్టర్ పర్యటన 

నిర్మల్ టౌన్, వెలుగు: తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని నిర్మల్ ​జిల్లాలోని చాకిరేవుగూడెంకు చెందిన ఆదివాసీలు చేపట్టిన 70 కిలోమీటర్ల పాదయాత్ర, కలెక్టరేట్​ ముట్టడితో ప్రభుత్వం దిగొచ్చింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్​ ఆదేశాలతో బుధవారం కలెక్టర్, వివిధ శాఖల ఆఫీసర్లు చాకిరేవుగూడెంలో పర్యటించారు. దశాబ్దాలుగా తమ గూడెంకు కరెంటు, రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేవని, ఎన్నికలప్పుడు ఓట్ల కోసం లీడర్లు వచ్చిపోతున్నారే తప్ప పట్టించుకోవట్లేదని మూడు రోజుల కింద పాదయాత్ర చేపట్టారు. మంగళవారం నిర్మల్  చేరుకుని కలెక్టరేట్​ ముట్టడించారు. బుధవారం కలెక్టరేట్ ముందు దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వంటావార్పు చేపట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్​ చాకిరేవు గూడెం వెళ్లాలని ఆదేశించడంతో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకీ , అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ చౌహాన్, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కోటేశ్వర్​రావు, ఇరిగేషన్ ఈఈ రామారావు, పోలీస్ ఆఫీసర్లు గూడెంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కవ్వాల్​అభయారణ్యంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూల్స్​ అడ్డొస్తున్నాయని, వేరే చోట పునరావాసం కల్పిస్తామని చెప్పగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో సోలార్ ​కరెంట్, బోరు, రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆందోళన విరమించాలని కోరారు. ఆఫీసర్లు వచ్చారని తెలుసుకున్న మరో గ్రామమైన గుమ్మెన వెంగువపల్లి గ్రామస్తులు తమకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తానని కలెక్టర్​హామీ ఇచ్చారు. ఆదివాసీల వంటావార్పుకు బీజేపీ, టీజేఎస్​ సంఘీభావం తెలిపారు.