ట్యాంక్ బండ్‌‌పై త్రివర్ణ బెలూన్ల కార్యక్రమం

ట్యాంక్ బండ్‌‌పై త్రివర్ణ బెలూన్ల కార్యక్రమం

స్వతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 08వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనెల 08వ తేదీన సీఎం కేసీఆర్ వేడుకలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ట్యాంక్ బండ్ పై త్రివర్ణ బెలూన్ల కార్యక్రమం శనివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో... ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.  

ట్యాంక్ బండ్ - తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు, అంబేద్కర్ విగ్రహం - ఇక్బాల్ మినార్, లిబర్టీ - హిమాయత్ నగర్, కవాడిగూడ వైపు సెయిలింగ్ క్లబ్ - డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ గోశాల, కవాడిగూడ - జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

పార్కింగ్ ప్లేసులు
అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే వారికి పలు ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ రోడ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, లోయర్ ట్యాంక్ బండ్ స్లిప్ రోడ్, ఎన్టీఆర్ స్టేడియం, బుద్ధ భవన్ రోడ్, నెక్లెస్ రోడ్ లలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.