- 27 రకాల అటవీ ఉత్పత్తులను కొంటున్న గిరిజన కార్పొరేషన్
- నిరుడు రూ.10 కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోలు
- గోడౌన్ల నిర్మాణానికీ నిధులు ఇవ్వనున్న ట్రైఫెడ్
హైదరాబాద్, వెలుగు: అడవుల నుంచి గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు ఇకపై మద్దతు ధర లభించనుంది. వివిధ పంటలకు అందిస్తున్నట్లుగానే ట్రైబల్ ఉత్పత్తులకు కూడా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) అమలు చేస్తున్నది. ఇందుకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ (మోటా) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రైఫెడ్ (ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్, జీసీసీ ఎండీ సబ్యసాచి ఘోష్ తో ట్రైఫెడ్ ఎండీ రాజమురుగన్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం జీసీసీకి బూస్ట్ లాంటిదని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల నుంచి ఎక్కువ ఉత్పత్తులు వస్తున్నా నిధుల కొరత జీసీసీకి పెద్ద సమస్యగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ నిధుల
కొరత తీరనుంది.
జీసీసీకి అండగా ట్రైఫెడ్
తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో అడవుల నుంచి గిరిజనులు ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఆ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు జీసీసీ కొనుగోలు చేస్తున్నది. తాజా ఒప్పందంతో ఈ ఉత్పత్తుల కొనుగోలుకు ఖర్చు చేస్తున్న మొత్తాన్ని జీసీసీకి ట్రైఫెడ్ ఇవ్వనుంది. నిరుడు జీసీసీ గిరిజనుల నుంచి రూ.10 కోట్ల విలువ కలిగిన వస్తువులను కొనుగోలు చేసింది.
వీటిని బహిరంగ మార్కెట్ లో జీసీసీ అమ్ముతుంది. ఆ అమ్మకాలతో ఒకవేళ నష్టం వచ్చినా ట్రైఫెడ్ భరించనుంది. అదేవిధంగా గిరిజనుల ఉత్పత్తులను నిల్వ చేయడానికి ట్రైబల్ జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.15 లక్షల వ్యయంతో సుమారు 50 గౌడోన్లను నిర్మించాలని ప్లాన్ చేసింది. వీటికి కూడా ట్రైఫెడ్ నిధులు అందజేయనుంది.
27 రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న జీసీసీ
రాష్ట్రంలో మొత్తం 27 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని జీసీసీ అధికారులు చెప్తున్నారు. సేకరించిన ముడిపదార్థాల నుంచి షాంపూలు, సబ్బులు, త్రిఫల చూర్ణం వంటి 27 రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పపువ్వును ఆహారంగా, పానీయాల తయారీలో, ఔషధాల్లో వాడుతారు. రాతి తేనెటీగల నుంచి తేనె సేకరిస్తారు.
జీసీసీ తేనెకు మార్కెట్ లో గిరాకీ ఉంది. తప్పసి చెట్ల జిగురును ఆహార పరిశ్రమలో, మందుల తయారీలో ఉపయోగిస్తారు. తునికాకును బీడీల తయారీలో ఉపయోగిస్తారు. చింతపండును గింజలు, చింతపండును సేకరించి విక్రయిస్తారు. ఉసిరి తదితర ఉత్పత్తులను ఆయుర్వేద మందుల్లో వాడతారు. కరక్కాయను జీర్ణ సంబంధిత ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
2013 నుంచి పెండింగ్
జీసీసీలు ట్రైఫెడ్ తో చేతులు కలపాలని 2013 నుంచి కేంద్రం కోరుతున్నది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే ఏ నిధులను అయినా వదులుకోవద్దని అన్ని శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖ అధికారులు కేంద్ర ట్రైబల్ అధికారులతో చర్చించి ట్రైఫెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
