ట్రిపుల్ ఆర్ పరిహారం పెంచుతున్నరు.. ఎకరం రూ. 35 లక్షలు..!

 ట్రిపుల్ ఆర్ పరిహారం పెంచుతున్నరు.. ఎకరం రూ. 35 లక్షలు..!
  • గతంలో ఇచ్చిన పరిహారంపై  నిర్వాసితుల అసంతృప్తి
  •  ‘ఆర్బిట్రేషన్’ ను ఆశ్రయించిన బాధితులు 
  • ల్యాండ్ విలువ పెంపుపై కలెక్టర్ అభిప్రాయ సేకరణ
  • రూరల్లో ఎకరానికి రూ. 35 లక్షలకు కలెక్టర్ సుముఖత
  • ఉత్తర భాగం కోసం యాదాద్రిలో 1,795  ఎకరాలు సేకరణ

యాదాద్రి, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు ఊరట లభించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.  భూములు కోల్పోతున్న రైతులతో చర్చించి, ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల సూచనలను పరిగణలోకి తీసుకొని భూముల విలువను పెంచే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. రిజిస్ట్రేషన్​ విలువ కంటే భూముల ధరలను 60  శాతం నుంచి వంద శాతానికి మించి పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్​ రెడీ చేస్తున్నారు. 

యాదాద్రిలో 1,795 ఎకరాలు...

భారత్​ మాల పరియోజన ఫేస్​-1లో యాదాద్రి జిల్లాలో ట్రిపుల్​ ఆర్​ ఉత్తర భాగం నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. భూసేకరణ నోటిఫికేషన్​ను 2022లో జారీ చేశారు. జిల్లాలోని  ఐదు మండలాల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డుకు 1,795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూ సర్వేతో పాటు బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్​ ఎంక్వైరీ కూడా ముగిసింది.

చౌటుప్పల్​ పరిధిలో కొంతమేర జరుగగా భువనగిరి ‘కాలా’ పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఆందోళనలు నిర్వహించడం, సర్వేను అడ్టుకోవడంతో ఆగిపోయింది. సర్వే పూర్తయిన తుర్కపల్లి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్​ కాలా పరిధిలో విడతల వారీగా పరిహారం విడుదల చేస్తోంది.

రిజిస్ట్రేషన్​ విలువ తక్కువే.. 

భూ సేకరణ చట్టం 2013 ప్రకారం నోటిఫికేషన్​ జారీ అయిన సమయంలోని రిజిస్ట్రేషన్​ విలువ ప్రకారం రూరల్​ ప్రాంతాల్లో మూడు రెట్లు, అర్బన్​ ప్రాంతాల్లో రెండు రెట్ల పరిహారం అందిస్తారు. అయితే రిజిస్ట్రేషన్​ విలువను చాలా ఏండ్ల తర్వాత 2021-–22లో అప్పటి ప్రభుత్వం సవరించింది. అయినప్పటికీ ఈ ధర బహిరంగ మార్కెట్​ కంటే చాలా తక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఎకరానికి రూ. 3.50 లక్షల నుంచి రూ.6.50 లక్షలకు మించి లేదు.  

తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎకరానికి రూరల్, కమర్షియల్​విభాగాల్లో రూ. 3.50 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ విలువ ఉంది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి, మండలం పరిధిలోని గ్రామాల్లో అర్బన్​, కమర్షియల్​ విభాగాల్లో రూ. 7 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంది. వలిగొండలో రూరల్, కమర్షియల్​ పరిధిలో రూ. 12 లక్షల వరకూ ధర ఉంది. చౌటుప్పల్​లోనూ అర్బన్, రూరల్, కమర్షియల్​ పరిధిలో రూ. 7 లక్షల నుంచి రూ. 42 లక్షల వరకూ ఉంది.

దీని ప్రకారం.. రూరల్​ ప్రాంతాల్లో రూ. 12 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ పరిహారం అందనుంది. అర్బన్​  ప్రాంతాల్లో ఎకరానికి రూ.14 లక్షల నుంచి రూ. 84 లక్షల వరకు అందుతుంది. ఇండ్ల స్థలాలకు రూ. 800 నుంచి రూ.3,100 వరకూ రిజిస్ట్రేషన్​ విలువ ఉన్నందున గజానికి రూ. 2,400 నుంచి రూ. 6,200 వరకూ పరిహారం అందనుంది. పరిహారం తక్కువగా వస్తుండడంతో నిర్వాసితులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 

‘ఆర్బిట్రేషన్’ కు నిర్వాసితులు..

ఇటీవలే ట్రిపుల్​ ఆర్​కు సంబంధించిన పరిహారం నిర్వాసితుల అకౌంట్లలో జమ అవుతోంది. దీంతో పరిహారం పెంచాలని కోరుతూ ఇటీవల పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు యాదాద్రి కలెక్టర్​అనురాగ్​జయంతి నేతృత్వంలోని ‘ఆర్బిట్రేషన్’ను ఆశ్రయించారు.  వీరితో మొదట ఆర్డీవోలు మీటింగ్​లు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం నిర్వాసితులతో కలెక్టర్​మీటింగ్ నిర్వహించారు.

బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటికి పైగా పలుకుతోందని, తమకు రూ. 12 లక్షల నుంచి రూ. 25 లక్షల పరిహారం ఇస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన సాధ్యమైనంత ఎక్కువగా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని  హామీ ఇచ్చారు. రూరల్​ ప్రాంతాల్లో ఎకరానికి కనీసం రూ. 35 లక్షలు అందించేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్ణయించిన రేటుపై నేషనల్​హైవే అథారిటీకి రిపోర్ట్​ చేస్తారు. అనంతరం పెంచిన పరిహారం అందిస్తారు. కాగా, అర్బన్​ ప్రాంతాలకు సంబంధించిన భూముల విలువ పెంపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.