
తిరువనంతపురం : ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దేవుడు శ్రీ అనంత పద్మనాభస్వామి. ఆయన ఊరేగింపు అంటే ఆషామాషీగా ఉండదు. చివరకు విమానాలు సైతం ఆకాశంలో ఎగరడం మానుకోవాల్సిందే. స్వామివారి ఊరేగింపు కారణంగా మంగళవారం ఐదు గంటల పాటు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసుల్ని నిలిపివేశారు.
అనంత పద్మనాభుడికి ఏటా ఆరటు పేరుతో ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రతువు మంగళవారం జరిగింది. ఆరట్టు ఊరేగింపులో భాగంగా ట్రావెన్ కోర్ రాజ కుటుంబం ఆధ్వర్యంలో సముద్రస్నానం కోసం ఆలయం నుంచి శంఖుముఖం బీచ్ వరకు స్వామివారిని మేళతాళాల మధ్య తీసుకెళ్తారు. అయితే ఈ ఊరేగింపు త్రివేండ్ర ఎయిర్ పోర్పు రన్ వే మీదుగా సాగుతుంది. అనంతరం అక్కడే ఉన్న కురుక్కు మండపం వద్ద ఉత్సవమూర్తులను కొద్దిసేపు ఉంచుతారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని కోవెలకు తీసుకెళ్తారు. 8వ శతాబ్దం నుంచి ఏడాదికి రెండుసార్లు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఈ క్రతువు నిర్వహించడంతో త్రివేండ్రం ఎయిర్ పోర్టు రన్ వేను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరాల్సిన, రావాల్సిన ఫ్లైట్లను రీ షెడ్యూల్ చేశారు. స్వామివారి ఊరేగింపు కోసం 10 విమానాల రాకపోకల సమయాల్లో మార్పు చేశారు.