సొంత నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా

సొంత నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా

రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండటంతో అధికార టీఆర్ఎస్​ అలర్టయింది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేల కదలికలపై నజర్​ వేసింది. ఇంటెలిజెన్స్‌‌, స్పెషల్‌‌ బ్రాంచ్‌‌తో పాటు సొంత మనుషులతో నిఘా పెట్టినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కువగా ఎవరికి ఫోన్లు చేస్తున్నారు.. సీక్రెట్‌‌ మీటింగ్స్‌‌ ఏమైనా అటెండ్‌‌ చేస్తున్నారా, హైదరాబాద్‌‌లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, సొంత జిల్లాలో ఎవరెవరితో టచ్‌‌లో ఉంటున్నారంటూ ప్రతి విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జేపీ నడ్డా ఈ నెల 18న హైదరాబాద్‌‌కు వస్తుండటంతో.. టీఆర్‌‌ఎస్‌‌ తమ ఎమ్మెల్యేలపై ఫోకస్‌‌ పెంచింది.

డజను మంది వరకు..

టీఆర్‌‌ఎస్‌‌ నుంచి గెలిచిన పది పన్నెండు మంది ఎమ్మెల్యేల కదలికలపై పార్టీ నాయకత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్లు బీజేపీతో టచ్​లో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో గెలిచిన వారిలో ముగ్గురు, నలుగురు.. కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ జిల్లాల నుంచి గెలిచినోళ్లలో ఇద్దరేసి ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారనిఅంటున్నారు. ఆదిలాబాద్‌‌‌‌, మెదక్‌‌‌‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలూ తమతో టచ్‌‌‌‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నాయకత్వంపై తమ సన్నిహితుల దగ్గర విమర్శలు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాలు ప్రభుత్వ పెద్దలను అలర్ట్‌‌‌‌ చేసినట్టు తెలిసింది.

ఎవరెవరితో ఎఫెక్ట్​?

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది తమ పనులు కావడం లేదని.. సీఎం కేసీఆర్‌‌‌‌, పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ తమకు కనీసం అపాయింట్‌‌‌‌ మెంట్‌‌‌‌ కూడా ఇవ్వడం లేదని చెప్తున్నట్టు తెలిసింది. అభివృద్ధి పనులకు సంబంధించి సీఎంవో అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లి ఫాలో అప్‌‌‌‌ చేసినా ఫైలు ఇంచు కూడా కదలడం లేదని.. తమ బాధ చెప్పుకుందామంటే నాయకత్వాన్ని కలిసే అవకాశమే లేదని వాపోతున్నట్టు సమాచారం. అలాంటి వారితో ఇప్పటికిప్పుడు పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని హైకమాండ్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు లోక్​సభ ఎలక్షన్ల సమయంలో సొంత పార్టీ క్యాండిడేట్ల కోసం పనిచేయ లేదని నాయకత్వం ఇప్పటికే అంచనాకు వచ్చింది. అప్పుడు పనిచేసిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ మారడానికి అవకాశాలను వెతుకుతున్నట్టు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్యులు అంచనా వేస్తున్నారు.

వేచి చూస్తున్న కొందరు..

2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను నాయకత్వం ప్రోత్సహించింది. మరికొన్ని చోట్ల ఆల్టర్నేట్‌‌‌‌ నేతలపై దృష్టి సారించింది. దీంతో డిఫెన్స్‌‌‌‌లో పడిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద పదవి పోతుందని.. అందువల్ల తమ అనుచరులను ముందు పంపి, ఎలక్షన్ల నాటికి తాము కూడా వెళ్లాలన్న ఆలోచనలో పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాపాడుకునేదెట్ల?

పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడే పార్టీ మారితే బీజేపీ బలం పెరగడంతో పాటు మున్సిపల్‌‌ ఎలక్షన్లపై ఆ ప్రభావం ఉంటుందని టీఆర్‌‌ఎస్‌‌ నాయకత్వం అంచనా వేస్తోంది. ఎక్కువ అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడటమో, వాళ్లకు సంబంధించిన పెండింగ్‌‌ పనులు మంజూరు చేయడం ద్వారా వారిని చల్లబరచడమో చేయాలని చూస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే పదవి పోతుందని, రెంటికీ కాకుండా పోతారని హెచ్చరించడం ద్వారా కఠినంగా వ్యవహరిస్తున్నామనే సంకేతాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు చెప్తున్నాయి.

వాట్సాప్​లోనే కాల్స్..

పార్టీ నిఘా పెట్టినట్టుగా సమాచారం ఉండటంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలెవరూ ముఖ్య విషయాలను సెల్‌‌‌‌ ఫోన్లు, ల్యాండ్‌‌‌‌ లైన్లలో మాట్లాడటం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పొలిటికల్‌‌‌‌ విషయాలైతే అస్సలు మాట్లాడటం లేదంటున్నాయి. నియోజకవర్గాల నుంచి నాయకులు, ప్రజల సమస్యలు, అధికారులు, మంత్రుల పీఎస్‌‌‌‌లు, ఇతర అధికారిక వ్యవహారాలను మాత్రమే ఫోన్లలో మాట్లాడుతున్నారు. సన్నిహితులైన లీడర్లతో మాట్లాడటానికి, ముఖ్యమైన అంశాలు పంచుకోవడానికి వాట్సాప్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ కాల్స్‌‌‌‌పైనే ఆధారపడుతున్నారు. లేకుంటే టైం చూసుకొని ప్రైవేట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కలిసి మాట్లాడుకుంటున్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నది, ఎవరిని కలుస్తున్నది బయటపడకుండా ఉండేందుకు కొన్నిస్లార్లు గన్‌‌‌‌ మన్లను కూడా వదిలేసి వెళ్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలేవో చర్చించుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతున్నారు.