ప్రధాని రాకపై టీఆర్ఎస్, లెఫ్ట్ నిరసనలు

ప్రధాని రాకపై టీఆర్ఎస్, లెఫ్ట్ నిరసనలు

నెట్​వర్క్, వెలుగు: ఆర్ఎఫ్​సీఎల్​ను జాతికి అంకితం చేయడానికి శనివారం రామంగుండానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన పర్యటనను అ డ్డుకునేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​తో పాటు గోదావరిఖని, కోల్​బెల్ట్​ ఏరియాలో ‘మోడీ గో బ్యాక్’​ అంటూ నిరసనలకు దిగిన వారిని అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. గోదావరిఖనిలో టీఆర్ఎస్, ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం, సీపీఐ, సీపీఎం నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు ప్రయత్నం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్యను గోదావరిఖనిలో అదుపులోకి తీసుకొని మంచిర్యాల జిల్లా జైపూర్​ పోలీసుస్టేషన్​కు తరలించారు. పెద్దపల్లిలో  నిరసన ర్యాలీ నిర్వహించిన సీఐటీయూ లీడర్లను అరెస్టు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోల్​ బెల్ట్​లో మోడీ పర్యటనకు నిరసనగా ఆందోళన చేసిన  సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైరా  రింగ్​ రోడ్​ సెంటర్​ లెఫ్ట్​ పార్టీల ఆధ్వర్యంలో  భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా  ఖమ్మం పాత బస్టాండు దగ్గర సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.   

హైదరాబాద్​లో స్టూడెంట్ల నిరసన 

మోడీ రాకను వ్యతిరేకిస్తూ గ్రేటర్​ హైదరాబాద్ లో స్టూడెంట్లు, టీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. వారిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద చేనేత కార్మికులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.