కర్నె ప్రభాకర్ నన్ను ఇబ్బందికి గురిచేస్తుండు

కర్నె ప్రభాకర్ నన్ను ఇబ్బందికి గురిచేస్తుండు
  •     కేటీఆర్​కు రాసిన లెటర్​లో పేర్కొన్న టీఆర్ఎస్​ కౌన్సిలర్​

మునుగోడు/చండూరు, వెలుగు: మున్సిపల్ ​ఎన్నికల్లో అప్పులు చేసి రూ. 3 కోట్లు ఖర్చు చేశానని.. అలాంటి తనపై పాత కేసులు ఓపెన్​చేయించి వేధిస్తున్నారని ఓ కౌన్సిలర్​ కేటీఆర్​కు లెటర్​రాసి ట్వీట్ ​చేయడం సోషల్​మీడియాలో వైరలైంది. నల్గొండ జిల్లాలోని చండూరు మండల కేంద్రం నూతన మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 2020లో మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన1వ వార్డు అభ్యర్థిగా కోడి వెంకన్న, పార్టీ చైర్మన్​ అభ్యర్థిగా 3వ వార్డుకు ఆయన భార్య పోటీ చేశారు. వెంకన్న గెలవగా ఆయన భార్య ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రూ. 3 కోట్ల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్లు వెంకన్న కేటీఆర్​కు రాసిన లెటర్​లో పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తున్నానని, కాంగ్రెస్​పార్టీలో ఉన్న తన తమ్ముడు తనపై అక్రమ కేసులు పెట్టినట్టు చెప్పారు. తన తమ్ముడికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​సహకరిస్తున్నారని ఆరోపించారు. తనపై పాత కేసులు తిరగతోడి చార్జిషీట్​దాఖలు చేయమని చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని కేటీఆర్​ను వేడుకున్నారు. కేటీఆర్​కు రాసిన లెటర్​లో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్న వెంకన్న 1, 3వ వార్డుల్లో చెరో రూ. 39,930 మాత్రమే ఖర్చు చేశామని ఎలక్షన్ ఆఫీసర్లకు లెక్కలు చూపించడం గమనార్హం.