
రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ ఆరోపణలు
ఎన్నార్సీ, సీఏఏలను తప్పుపడుతూ విమర్శలు
దీటుగా బదులిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర లీడర్లు
రాష్ట్రం వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నమని ఎదురుదాడి
మజ్లిస్‌తో కలిసి రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
కేంద్ర సర్కారు ఏమేం ఇచ్చిందో చెప్తూ ఎండగట్టే యత్న
మున్సిపోల్స్ తర్వాత మరింతగా ముదిరిన గొడవ
నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఫైట్
లోక్‌సభ ఎన్నికల తర్వాతి నుంచి కేంద్ర సర్కారుపై రాష్ట్ర సర్కారు పెద్దల విమర్శల దాడి మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ యాక్టివ్‌గా మారడం, ప్రజా సమస్యలపై వరుసగా ఆందోళనా కార్యక్రమాలు చేయడం, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యంగా మారిపోవడం టీఆర్ఎస్ సర్కారులో గుబులు రేపుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లు, మీడియా చిట్చాట్లన్నింటిలోనూ కేంద్రాన్ని టార్గెట్చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ లీడర్లు గట్టిగా బదులిచ్చారు.
కేటీఆర్ కామెంట్స్
కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ఎప్పట్నుంచో కేంద్రాన్ని కోరుతున్నం. మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయకు రూ.24,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసినా నిధులివ్వలేదు. జీఎస్టీ విషయంలో కేంద్రం మోసం, దగా చేస్తోంది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేండ్ల పాటు భర్తీ చేస్తామంది. తెలంగాణకు రూ.1,137 కోట్ల జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సి ఉంది. వీటిపై స్పష్టత లేదు.
కిషన్‌రెడ్డి కామెంట్స్
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. కాళేశ్వరం డీపీఆర్ సమర్పించకుండా జాతీయ హోదా ఇవ్వాలంటున్నారు. డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర సర్కారు నుంచి నిర్దేశిత ఫార్మాట్‌లో అప్లికేషన్ ఏదీ రాలేదని గతంలోనే కేంద్రం తేల్చిచెప్పింది. రాష్ట్ర పథకాలకు కేంద్రం ఎందుకు నిధులిస్తుంది? కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి రాష్ట్ర ప్రాజెక్టులకు వారే నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్‌వి అర్థంపర్థం లేని మాటలు. కేంద్ర పథకాలను పేరు మార్చి రాష్ట్ర పథకాలుగా చెప్పుకొంటున్నారు. ఎయిమ్స్, ఇటీవలే ప్రారంభమైన ఈఎస్ఐ మెడికల్ కాలేజీని కేంద్ర సర్కారే ఇచ్చింది.
హైదరాబాద్, వెలుగు: ఫస్ట్ టర్మ్‌లో కేంద్రంతో క్లోజ్‌గా మెదిలిన టీఆర్ఎస్ సర్కారు పెద్దలు.. రెండో విడతలో మాత్రం సెంటర్‌ను టార్గెట్ చేశారు. మున్సిపోల్స్‌లో మెజారిటీ సీట్లు దక్కించుకున్నప్పటి నుంచి మోడీ సర్కారుపై విమర్శల జోరు పెంచారు. కేంద్ర బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ పొలిటికల్ ఎటాక్ మొదలుపెట్టారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని, ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వటం లేదని, తమ విజ్ఞప్తులేవీ పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు దీటుగా సమాధానం చెప్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో బాగుపడుతున్నది తండ్రీకొడుకులే అంటూ కేసీఆర్, కేటీఆర్‌లను కార్నర్ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగానే కనిపిస్తున్నా.. అంతా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ వార్‌గా మారిపోయింది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్తర్వాత రాష్ట్ర సర్కారు పెద్దలు కేంద్రంపై మాటల తీవ్రతను పెంచారు. జీఎస్టీని అమలు చేయడంలో కేంద్రం ఫెయిలయిందని, సుమారు రూ.5 వేల కోట్లు బకాయిలు విడుదల చేయడం లేదని కేసీఆర్ ఆరోపించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, అవసరమైతే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ పెడతామని, సీఏఏను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు, సీఎంలతో రీజనల్ కాంక్లేవ్ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య దూరం మరింతగా పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు సీఎం మాటలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ లీడర్లు ఘాటుగా రియాక్టయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు ఎంఐఎంతో పొత్తుపొట్టుకుని కుహనా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మాటామాటా పెరుగుతూనే ఉంది.
కేసీఆర్.. కేటీఆర్ కామెంట్స్
1.బెంగళూరు, హైదరాబాద్ మధ్య రక్షణ పరిశ్రమల కారిడార్, తెలంగాణలో ఇంక్యుబేటర్ పెట్టాలని కోరితే.. బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేశారు. వాళ్ల ఎంపీలున్నచోటే పరిశ్రమలు పెడితే లాభమేంటి?
2.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)కు కేంద్రం నిధులు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ను పట్టించుకోబోమని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ ప్రకటించారు.
3.గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా సికింద్రాబాద్‌లో స్కైవే నిర్మిద్దామనుకున్నం. అందుకోసం బైసన్ పోలో గ్రౌండ్ భూములను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.
4.విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. కానీ ఇంకా అధ్యయనం దశలోనే ఉంది.
- పాత తొమ్మిది జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించిన బీఆర్‌జీఎఫ్ నిధులను కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇవ్వాలని కోరితే ఫలితం లేదు.
- కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, జిల్లాకో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఐఐఎం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) మంజూరు చేయాలనే ప్రతిపాదనలను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.
- కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని, ముచ్చర్లలోని ఫార్మాసిటీకి భారీ ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరినం, పట్టించుకోవడం లేదు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌ల కామెంట్స్
జీఎస్టీతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన అన్ని నిధుల్ని సకాలంలో చెల్లిస్తున్నాం. కేంద్ర బడ్జెట్ పై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నరు. శాఖలవారీగా, పథకాల వారీగా కేటాయింపులు ఉంటాయి. జేబులు నింపుకొనేందుకు, కమీషన్లు తీసుకునేందుకు కేటాయింపులు ఉండవు.
రాష్ట్రంలో అమలవుతున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో ఒక్కో కిలో బియ్యంపై 28 రూపాయల ఖర్చును కేంద్రమే భరిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలి.
రాష్ట్రంలో 70 ఏండ్లుగా జరగని జాతీయ రహదారుల అభివృద్ధిని కేంద్రం ఐదేండ్లలో చేసి చూపించింది. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.
రాష్ట్రానికి కేంద్రం సింహభాగం నిధులిచ్చింది. యూపీఏతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా నిధులిచ్చాం. అన్ని వర్గాలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంది.
సీఏఏపై ప్రాంతీయ పార్టీలను కూడగడతామని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ కుట్రలో కేసీఆర్ పావుగా మారారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలె.