తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ చీఫ్ కవిత. అందులో భాగంగా మే 15 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. మే 15 నుంచి జూన్15వ వరకు నెల రోజులపాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని మే 11న సూచించారు కవిత.
టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు - నిధులు - నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యామన్నారు. వలస పాలన నాటి దుష్పరిణామాలను ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నామని అన్నారు.
►ALSO READ | సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. 11 క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలంతో అభిషేకం
తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోందన్నారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ రక్షణ సేన జెండా ను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సి ఉందని పిలుపునిచ్చారు. అదే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పార్టీలో చేరిన నాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
