
రంగారెడ్డి: బీజేపీ నేత రాంచందర్ రావుకు ఎమ్మెల్సీ గా ఉండడం ఇష్టం లేదని, అంతకుముందు ఎమ్మెల్యే గా, ఎంపీగా పోటీ చేయగా.. ప్రజలు ఆయన్ను తిరస్కరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఆర్య వైశ్య భవన్ లో తెరాస సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు విద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అడ్వకేట్లకు రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమన్నారు. ప్రభుత్వం కరోనా సమయంలో రూ.25 కోట్లు సాయం అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదని గుర్తు చేశారు.
లాయర్లు తమ ఓటును వాణీదేవికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంసీలు ఉద్యమంలో, రాష్ట్రాభివృద్ధిలో లాయర్లు సహకారం అందించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోసారి సహకరించాలన్నారు. కరోనాతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, పిల్లల భవిష్యత్‌ను ఆలోచించి ఆరో తరగతి నుంచి విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిన మంచి అభ్యర్థి వాణీదేవికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. జూనియర్ కాలేజీ యాజమాన్యం ఉద్యమంలో ఉన్న వారు సహకరించాలన్నారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, వారికి బుద్ధి చెప్పేలా వాణీదేవికి ఓటు వేయాలని కోరారు.