టీఆర్ఎస్​ లీడర్ల దాడి.. బీజేపీ కార్యకర్త మృతి

టీఆర్ఎస్​ లీడర్ల దాడి.. బీజేపీ కార్యకర్త మృతి
  • భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో దారుణం
  • సర్పంచ్ ఇంటి ముందు డెడ్​బాడీ పూడ్చేందుకు యత్నం
  •  గ్రామంలో ఉద్రిక్తత

    
మహబూబ్​నగర్, వెలుగు:
టీఆర్ఎస్​ లీడర్ల దాడిలో బీజేపీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. మహబూబ్​నగర్ ​జిల్లా భూత్పూర్‌‌ మండలం కొత్త మొల్గర 
గ్రామానికి చెందిన మహేశ్‌‌(23) బీజేపీ కార్యకర్త. గ్రామంలో శివాలయం ముందు ప్రతిష్ఠించిన వినా యక విగ్రహం నిమజ్జనోత్సవం మంగళవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌‌ వెంకటమ్మ భర్త నర్సిములు గౌడ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహేశ్‌‌ అందరితో కలిసి వినాయకుడి ఎదుట డ్యాన్స్‌‌ చేశాడు. అయితే గొడవ జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో మహేశ్‌‌ తల్లి మాసమ్మ కొడుకును అక్కడినుంచి తీసుకుని వెళ్లేందుకు యత్నించింది. ఇంతలోనే వెనక నుంచి కొందరు యువకులు వచ్చి మహేశ్‌‌ను బలవంతంగా ఈడ్చుకు వెళ్లి రాళ్లతో దాడిచేశారు. తీవ్ర గాయాలైన మహేశ్​ను ఇంటి ఎదురుగా వదిలి వెళ్లారు. వెంటనే కుటుంబీకులు భూత్పూర్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌‌ తీసుకెళ్లాలని చెప్పారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మహేశ్‌‌ కొన్ని రోజులుగా గ్రామంలో జరుగుతున్న పనులపై సర్పంచ్‌‌ భర్త నర్సిములు గౌడ్​ను నిలదీస్తున్నాడు. గ్రామంలో నల్లమట్టిని తరలిస్తుండగా మహేశ్​తో పాటు కొందరు యువకులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని దేవాలయం అభివృద్ధి కోసం కొంత డబ్బును సమకూరుస్తామని మాటిచ్చారు. డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు చాలాసార్లు మహేశ్​పై దాడి చేసేందుకు యత్నించారని తల్లి మాసమ్మ ఆరోపించింది.
మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన
కుటుంబసభ్యులు మహేశ్ ​మృతదేహంతో బుధవారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని సర్పంచ్ ఇంటి వాకిట్లో గుంత తవ్వి అంత్యక్రియలు చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ ఆర్డీఓ పద్మజా యాదవ్  గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. మహేశ్ ​కుటుంబసభ్యులు, బంధువులు ఆఫీసర్ల మాటలు వినిపించుకోలేదు. మృతదేహాన్ని సర్పంచ్ ఇంటి ముందే పెట్టి ఆందోళనకు దిగారు. భూత్పూర్ సీఐ రజితా రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేశ్​పై దాడి చేసి హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ భర్త  నర్సిములుగౌడ్​తో పాటు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తను అతి దారుణంగా హతమార్చారని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి అన్నారు. మహేష్ కుటుంబసభ్యులకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బీజేపీ లీడర్లు ధర్నా చేపట్టారు. కుటుంబీకులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.