సర్కారు దవాఖానకు పోతే సస్తరు.. టీఆర్​ఎస్​ నేత ఆవేదన

సర్కారు దవాఖానకు పోతే సస్తరు.. టీఆర్​ఎస్​ నేత ఆవేదన
  • కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంటే చేస్తలేరని టీఆర్​ఎస్​ నేత ఆవేదన
  • బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు ఏవీ సాల్తలేవు
  • సిద్దిపేటలనే రోజుకు 30 మంది చస్తున్నరు
  • మీ ఇంటికి యశోద డాక్టర్లొస్తరు.. మా పరిస్థితేంది?
  • టీఆర్ఎస్‌కు 14 ఏండ్లు సేవజేసినా తండ్రిని బతికించుకోలేకపోయిన

సిద్దిపేట రూరల్, వెలుగు: ‘కరోనా సోకితే ప్రజలెవరూ సర్కారు దవాఖానాకు పోవొద్దు. అక్కడ డాక్టర్లు, బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు ఏవీ సాలినన్ని లేవు. ట్రీట్‌మెంట్ అందక జనం చస్తున్నరు’ అని సిద్దిపేటకు చెందిన టీఆర్‌ఎస్ లీడర్ గడ్డమీది రాజు గౌడ్ (జీవన్ రాజు) ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన తండ్రి నాగాగౌడ్‌కు కరోనా సోకడంతో ట్రీట్‌మెంట్‌ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ సరైన ట్రీట్‌మెంట్ అందక చనిపోయారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా హాస్పిటల్​దగ్గర తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో బుధవారం పోస్టు చేశారు. సొంత పార్టీ టీఆర్‌ఎస్‌పై, ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి 14 ఏండ్లు సేవ చేసినా ఆక్సిజన్, వెంటిలేటర్ లేక తన తండ్రిని బతికించుకోలేకపోయాయని చెప్పుకొచ్చారు.

సచ్చినోడు అండ్లనే.. బతికినోడు అండ్లనే
రాష్ట్రంలో అంతా  సక్కగ ఉన్నట్లు, అసలు కొవిడ్​బాధే లేనట్లు అధికారపార్టీ పత్రిక, చానల్‌లో చూపుతున్నారని రాజుగౌడ్‌ మండిపడ్డారు. ‘ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు. రాష్ట్రంలో రోజూ 30 మందే చనిపోతున్నట్టు చెబుతున్నరు. కానీ ఒక్క సిద్దిపేట హాస్పిటల్‌లోనే రోజుకు 30 మంది చనిపోతున్నరు. సిద్దిపేటలనే గిట్లుంటే రాష్ట్రమంతా ఎట్లుండాలె. నాతోని వస్తే చూపిస్త’ అన్నారు. ‘మా నాన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా కండ్ల ముందే ఒకేరోజు 40 మంది చనిపోయిన్రు. ఈడ ఒకటే ఐసోలేషన్​వార్డున్నది. చచ్చినోడు అండ్లనే, బతికినోడు అండ్లనే. శుక్రవారం రాత్రి మా నాన్నను హాస్పిటల్‌లో జాయిన్​ చేస్తే తెల్లారేసరికి ఆయన చుట్టూ 8 బెడ్లలోని 8 మంది చనిపోయిన్రు. ఆయన రాత్రంతా శవాలే మధ్యే ఉన్నడు’ అని వివరించారు. తాను శనివారం నాన్న దగ్గరికి పోతే.. ‘నన్ను ఈడికేలి కొంటవో బిడ్డా.. ఇక్కడనే ఉంచితే సచ్చిపోత’ అని పట్టుకొని ఏడ్చాడని చెప్పారు.

సర్కారు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంటే చేయట్లే
అసలు గవర్నమెంట్ హాస్పిటళ్ల ట్రీట్‌మెంటే జరగట్లేదని రాజుగౌడ్‌ ఆరోపించారు. డాక్టర్లు లేరు, సరిపడా ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్లు లేవని అన్నారు. ‘శుక్రవారం రాత్రి 6 గంటలకు మా నాన్నను తెచ్చి జాయిన్​ చేస్తే శనివారం 3 గంటల దాక ఒక్క సూదియ్యలే. గ్లూకోజు పెట్టలే. డాక్టర్‌ను అడిగితే దవాఖాన్ల 250 మంది పేషెంట్లు ఉంటే ఇద్దరమే డాక్టర్లమున్నమన్నడు. ‘మీ నాయనకు 60 ఏండ్లుంటయ్.​ ఇక్కడ ఆరేడు వెంటిలేటర్లే ఉన్నయి. 45 ఏండ్లలోపు చాలా మంది ఉన్నరు. వాళ్లను ఇడిసి పెట్టి మీ నాన్నను బతికించుమంటవా?’ అని అడిగారన్నారు. ఏం జేయాల్నో తెల్వక ప్రైవేట్‌కు తండ్రిని తీసుకుపోయానని.. 3,4 లక్షలు పెట్టుకున్నా బతుకలేదని ఆవేదన చెందారు.