టీఆర్ఎస్ నేతలవి ఝూటా మాటలు : ప్రహ్లాద్ జోషీ

టీఆర్ఎస్ నేతలవి ఝూటా మాటలు : ప్రహ్లాద్ జోషీ

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. శుక్రవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం దిల్​సుఖ్​నగర్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అబద్ధాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందన్నారు. బీజేపీలోకి కేటీఆర్, కవిత ఇంకెవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. ‘‘వాళ్లు కేసీఆర్, కేటీఆర్ కాదు.. జేసీఆర్, జేటీఆర్.. వాళ్లు చెప్పేవన్నీ ఝూటా మాటలు.. ముగ్గురు ఎమ్మెల్యేలున్న మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొంటున్నామనడం హాస్యాస్పదంగా ఉంది’’ అని అన్నారు.

ప్రధాని రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి, ధైర్యం లేక కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఏనాడూ ప్రజలను కలవడని, ప్రజల కనీస సమస్యలను పట్టించుకోని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరే నని అన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని తెలంగాణ సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. ఒడిశా రాష్ట్రం గనులపై మంచి లాభాన్ని ఆర్జిస్తుంటే.. తెలంగాణలో గనుల నుంచి వచ్చే రాబడిని సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు 
తదితరులు పాల్గొన్నారు.