మంత్రి హరీశ్ మీటింగ్ లో ఓటర్లకు మందు పంపిణీ

మంత్రి హరీశ్ మీటింగ్ లో  ఓటర్లకు మందు పంపిణీ

ఎల్బీ నగర్ తుర్కయాంజల్ లోని ఓ  ఫంక్షన్ హాల్ లో  టీఆర్ఎస్ లీడర్లు ఓటర్లకు మందు బాటిళ్లు పంచారు. మంత్రి హరీశ్ రావు మీటింగ్ అయిపోగానే.. వచ్చినవాళ్లకు మందు బాటిళ్లు ఇచ్చారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడు ఓటర్లతో ఇవాళ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ వ్యవహారం జరిగింది. 



మునుగోడు బైపోల్ కోసం హైదరాబాద్ లో టీఆర్ఎస్ వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్ లో రోజూ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇదే ఫంక్షన్ హాల్ లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ఇటీవల రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సు కోసం మునుగోడు నుంచి పెద్దసంఖ్యలో రైతుల్ని తరలించారు. ఆ తర్వాత పద్మశాలీల, లారీ డ్రైవర్ల  ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఇక్కడే జరిగాయి. ఇదే క్రమంలో ఇవాళ మన్నెగూడలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన గౌడ  ఆత్మీయ సమ్మేళనానికి కూడా మునుగోడు నుంచి ప్రజల్ని తరలించారు.

మునుగోడు ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి మందు పంపిణీ చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మంత్రి కూడా దానిపై క్లారిటీ  ఇచ్చారు. అయినా ఎన్నికల అధికారులు మాత్రం ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెబుతుండటం గమనార్హం. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రోజూ ఓటర్లను టీఆర్ఎస్ ప్రలోభ పెడుతున్నా.. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.