ఫండ్స్ కోసం ప్రగతిభవన్​కు క్యూ కడుతున్న నేతలు

ఫండ్స్ కోసం ప్రగతిభవన్​కు క్యూ కడుతున్న నేతలు

నల్గొండ, వెలుగు : ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్​కు సర్కారు వరాలు కురిపిస్తుండడడంతో.. తమకూ ఫండ్స్​ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలందరూ ప్రగతిభవన్​కు క్యూ కడుతున్నారు.  ఒక్క హుజూరాబాద్​కే ఫండ్స్​ ఇస్తారా.. మీరు ఎందుకు మౌనంగా ఉంటారంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై మున్సిపాలిటీ పాలకవర్గాలు, పబ్లిక్​ నుంచి ప్రెజర్​ పెరిగిపోతోంది. ఈక్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలంతా తమకూ ఫండ్స్​ ఇవ్వాలని కోరుతూ  ప్రగతిభవన్​లో  మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ను కలిసి తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతిపత్రాలు అందిస్తున్నారు. చిన్నసారు ఫండ్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయనను కలిసిన ఫొటోలు మీడియాకు రిలీజ్​ చేసి, సోషల్​లో మీడియాలో పోస్టు చేసి నియోజకవర్గాల్లో తమపై ఉన్న ప్రెజర్​ను కొంచెంలో కొంచెం తగ్గించుకుంటున్నారు.  హుజూరాబాద్​లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంపై వందల కోట్ల వరాలు గుప్పిస్తున్నారు.  దళితబంధు లాంటి స్కీమ్​కు హుజూరాబాద్​ నియోజకవర్గాన్ని పైలట్​ ప్రాజెక్టుగా ప్రకటించి, ఇప్పటికే రూ.1000 కోట్లు రిలీజ్​ చేశారు. పట్టణాలు, గ్రామల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతరత్రా డెవలప్​మెంట్​వర్క్స్​ కోసం రూ.200 కోట్ల దాకా సాంక్షన్​ చేశారు. ఇందులో భాగంగా  హుజూరాబాద్​, జమ్మికుంట టౌన్లకు రూ.65 కోట్లు ఇచ్చారు. ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్​కే అన్నీ ఇస్తారా? అనే విమర్శలు ఇలా వచ్చాయో లేదో అలా వాసాలమర్రికి వెళ్లి అక్కడ 76 దళిత కుటుంబాలకు 7.6 కోట్లు రిలీజ్​ చేశారు. అప్పట్లో సాగర్​ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు ఇచ్చారు.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రెజర్​..

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకే సీఎం కేసీఆర్​ వందల కోట్లు కేటాయిస్తుండడంతో అక్కడ మాత్రమే అంతో ఇంతో డెవలప్​మెంట్​వర్క్స్​ జరుగుతున్నాయి. హుజూర్​నగర్ నుంచి మొదలు పెడితే మొన్నటి  నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వరకు ఇదే సీన్​ కనిపించింది. సాగర్​లో జానారెడ్డిని ఢీకొట్టేందుకు సుమారు రూ. 3వేల కోట్ల విలువైన పనులకు సీఎం సాంక్షన్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కూడా హాలియా సభలో మరో రూ. 150 కోట్లు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు కేటాయించారు. తాజాగా ఇప్పుడు హుజూరాబాద్​ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోంది. దళితబంధు స్కీంకు అదే నియోజకవర్గాన్ని పైలట్​ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దీంతో మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలను పబ్లిక్​ నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ మధ్య సోషల్​ మీడియాలో పెద్ద  క్యాంపెయిన్​ నడిచింది.  మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండున్నర ఏండ్లు దాటినా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ ఫండ్స్)​ రిలీజ్ కాలేదు. ఈ మధ్యే ఒక్కో నియోజకవర్గానికి రూ. 5కోట్లు సాంక్షన్​ చేస్తూ జీ వో ఇచ్చారు. ఇందులో రూ. 2 కోట్లు ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలన్న కండీషన్​ పెట్టారు. దాదాపు మూడేళ్లుగా సీడీపీ ఫండ్స్​ ఇవ్వనందున  రూ. 3 కోట్లతో ఏం చేయగలమని ఎమ్మెల్యేలు నారాజ్​గా ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి కూడా ఏడాదిన్నర పూర్తయింది. పాత, కొత్త ము న్సిపాలిటీల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదు. కొత్త మున్సిపాలిటీల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పట్టణ ప్రగతి కింద ఇస్తున్న  నిధులు ఏమూలకు చాలడం లేదు. మున్సిపాలిటీలకు వస్తున్న ఆదాయం సాలరీలకు, మెయింటనెన్స్​కే సరిపోవడం లేదు.  చాలా మున్సిపాలిటీల్లో కనీస మౌలికవసతులు కరువయ్యాయి.  దీంతో ఫండ్స్​ తెచ్చి మున్సిపాటీల్లో సమస్యలు తీర్చాలనే డిమాండ్లు ఆయా మున్సిపల్​ పాలకవర్గాల నుంచి వస్తున్నాయి.