
హైదరాబాద్, వెలుగు: త్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్‌కు గైర్హాజరవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది. బిల్లుపై గతేడాది డిసెంబర్‌లో అనుసరించిన వైఖరినే కొనసాగిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు బుధవారం చెప్పారని తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తే ఓ సమస్య, అనుకూలంగా ఓటేస్తే మరో సమస్య తప్పదని తను అన్నారంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత శుక్రవారం లోక్‌సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టింది. ముస్లిం మహిళలకు లింగ సమానత్వం, న్యాయం కోసం బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుపై టీఆర్‌ఎస్ వైఖరిని వెల్లడించాలని కాంగ్రెస్ మైనార్టీ వింగ్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ డిమాండ్ చేశారు.