పసుపు రైతుల ఉసురు తగులుతుంది

పసుపు రైతుల ఉసురు తగులుతుంది
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

హైదరాబాద్: బీజేపీ పార్టీకి, ఆ పార్టీ వారికి పసుపు రైతుల ఉసురు తగులుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. గన్ పార్కు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు విషయంలో బాండ్ రాసారు, బోర్డ్ తీసుకురాకపోతే రాజీనామా చేస్తాను అని అరవింద్ చెప్పారు ..రెండు సంవత్సరాలు అయింది.. పసుపు బోర్డు ఏమయింది.. ఎక్కడొచ్చింది.. అని ప్రశ్నించారు. నిన్న పార్లమెంట్ లో మా ఎంపీలు అడిగితే ..పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పసుపు బోర్డు ఇవ్వమని స్పష్టం గా చెప్పారు.. బీజేపీ పార్టీ అంటే అబద్ధాల  పార్టీ అని వెల్లడైంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా  చేసి రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఐటీఐఆర్, రైల్వే కోచ్ సెంటర్ కూడా ఇవ్వమని చెప్పారు ..బండి సంజయ్ మీ ఎంపీ అరవింద్ తో రాజీనామా  చేయించు.. అని డిమాండ్ చేశారు. మేము  చేసిన వాటిని గవర్నర్ చెప్పడానికి గంటపైన సమయం పట్టింది ..భట్టి విక్రమార్క కి ఏం నచ్చలేదు.. షాదిముబారక్ నచ్చలేదా..? రైతు బంధు నచ్చలేదా.. లేక కాళేశ్వరం  ద్వారా నీళ్లు ఇవ్వడం నచ్చలేదా.. ? చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో గంట ఇరవై నిముషాలలో మేము చేసిందే గవర్నర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ అంటే అమ్మకం పార్టీగా మారింది.. ప్రతీ రోజు ఒక్కో సంస్థని బీజేపీ అమ్ముతోంది.. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. ఎంపీ అరవింద్ మీకు దమ్ముంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరకు వెళ్లి పసుపు బోర్డ్ పై మాట్లాడు.. లేకుంటే పసుపు రైతుల ఉసురు తగిలి మీ పార్టీ.. మీరు నాశనం అవుతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు.