
ఢిల్లీలో మర్కజ్ సమావేశాలు జరుగుతుంటే.. ప్రధాని మోడీకి, అమిత్ షాకి సోయి లేదా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా గురించి తప్పుగా మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని రాష్ట్రాలన్నీ కరోనాతో సతమతమవుతున్నాయి. కరోనా విషయంలో రాజకీయాలు వద్దంటే.. నడ్డా తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. ‘లాక్ డౌన్ టైమ్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజలకు ఒక్క వాటర్ బాటిల్ కూడా పంచలేదు. నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నవ్. బిడ్డా.. నడ్డా.. ఇది తెలంగాణ అడ్డా… తప్పుడు ప్రచారాలు ఆపాలి. నిజామాబాద్ లో గుండు.. కరీంనగర్ లో బండి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది. బీజేపీ పాలిత ప్రాంతాలలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. బీజేపీ బడా జూటా పార్టీ. తెలంగాణలో కరోనా టెస్టులకొసం మేం టెస్టింగ్ మిషన్ ఆర్డర్ చేస్తే.. దాన్ని కలకత్తాకు పంపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్య ప్రచారాలు ఆపాలి. ఢిల్లీ రాజధానిలో 2000 మందితో మర్కజ్ లో సమావేశం నిర్వహిస్తే.. మోడీకి, అమిత్ షాకి సోయి లేదా? తెలంగాణ ప్రభుత్వం చెప్తే కానీ కేంద్రానికి మర్కజ్ పై సమాచారం లేదు. కంటెయిన్మెంట్ లు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్తేనే కేంద్రానికి తెలిసింది. ఐసీఎంఆర్ తో పరీక్షలు చేయించాలని కూడా కేసీఆర్ చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 60 వేల కరోనా టెస్టులు చేశాం. మోడీ 30 కోట్ల మంది వలస కార్మికుల ఉసురు పోసుకున్నారు. రాత్రికిరాత్రి ప్రెస్ మీట్ పెట్టి లాక్ డౌన్ ప్రకటించారు. ఒక రాత్రి చప్పట్లు, ఒక రాత్రి దీపాలు పెట్టమని చెప్పడం ప్రధాని మోడీ పని’ అని ఆయన అన్నారు.
For More News..