రాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది

రాష్ట్రాన్ని దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ  వచ్చింది

హైదరాబాద్: కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం ఏవీ పనిచేయవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పై బీజేపీ నాయకులు మిడతల దండులా పడుతున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లకాలంలో నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరులను దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ మోడీ టీం వచ్చిందని ఆరోపించారు.  కేంద్ర మంత్రులు దొంగల ముఠాలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సౌత్ ఇండియా జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు. మోడీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ స్వాగతం చెప్పలేదని అంటున్నారని, అసలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోడీకి తామెందుకు స్వాగతం చెప్పాలని నిలదీశారు. బండి సంజయ్ కొత్త బిచ్చగాడని, అధ్యక్ష హోదాలో ఇదే ఆయనకు చివరి సభ అని చెప్పారు.  మహిళలపై  ప్రేమ ఉంటే మహిళా రిజర్వేషన్లు?  దళితులపై ప్రేమ ఉంటే దళితబంధు దేశం అంతటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆరెస్ ది అభివృద్ధి ఆలోచన అయితే..బీజేపీ దుష్టబుద్ధి ఆలోచన అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము మోడీకి లేదని స్పష్టం చేశారు.