రెసిడెన్షియల్‌‌ స్కూళ్లకు సొంత బిల్డింగ్​లు కట్టించాలె

రెసిడెన్షియల్‌‌ స్కూళ్లకు సొంత బిల్డింగ్​లు కట్టించాలె
  • అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
  • కిరాయి బిల్డింగుల్లో సౌలతులులేక స్టూడెంట్లకు ఇబ్బందులు
  • టీచర్లు, స్టాఫ్​ పోస్టులు భర్తీ చెయ్యాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్  రెసిడెన్షియల్ స్కూళ్లు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, స్టూడెంట్లు ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. టీచర్లు, స్టాఫ్​ పోస్టులు భర్తీ చేయాలని.. పక్కా బిల్డింగులు కట్టించాలని సర్కారును కోరారు. శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్​ హవర్​లో ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, బాజిరెడ్డి గోవర్ధన్, ఆత్రం సక్కు, అంజయ్య, షకీల్ లు ఈ విషయాన్ని లేవనెత్తారు. చాలా స్కూళ్లకు సొంత బిల్డింగులు లేవని, అద్దె బిల్డింగుల్లో నడుస్తున్న స్కూళ్లలో వసతుల్లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు. టీచర్లు, స్టూడెంట్లు ఒకే చోట ఉండేలా పక్కా బిల్డింగ్​లు, స్టాఫ్​ క్వార్టర్లు కట్టించాలని డిమాండ్​ చేశారు. ప్రస్తుతం పాత జిల్లాల ప్రకారం అడ్మిషన్లు ఇస్తున్నారని.. కొత్త జిల్లాల వారీగా, వీలైతే నియోజకవర్గాల వారీగా అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. తమ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్లలో పది శాతం మందికి కూడా అడ్మిషన్లు రావడం లేదని, అందుకే నియోజకవర్గాల వారీ అడ్మిషన్లు అవసరమని ఎమ్మెల్యే అంజయ్య చెప్పారు. టీచర్, ఇతర స్టాఫ్​ పోస్టులు భర్తీ చేయాలని, స్పోకెన్ ఇంగ్లిష్‌‌  క్లాసులు చెప్పించాలని, గెస్ట్​ టీచర్లను పర్మినెంట్​ చేయాలని ఆత్రం సక్కు కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి టీవీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవని.. పిల్లలు ఆన్‌‌ లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారని వివరించారు. సర్కారే టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో దళిత వర్సిటీ పెట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఉద్యోగాలు, ఆదాయం లేక ప్రైవేట్ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని, వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌‌  సర్కారును కోరారు.

అడ్మిషన్లలో ఎమ్మెల్యే కోటా పెట్టాలె

రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ఎమ్మెల్యే కోటా ప్రవేశపెట్టాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అనాథలు, నిరుపేదలు తమ వద్దకు వస్తున్నారని, అలాంటి వారికి తాము చెప్తే సీట్లు ఇచ్చే విధానం ఉండాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్  సమాధానమిచ్చారు. అద్దె బిల్డింగ్​లకు ఏటా రూ.174.25 కోట్లు చెల్లిస్తున్నామని, ఆర్థిక పరిస్థితిని బట్టి సొంత బిల్డింగ్​లు  నిర్మిస్తామన్నారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడాన్ని పరిశీలిస్తం: ఈటల

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌‌ చెప్పారు. కాంటాక్ట్ ట్రెసింగ్‌‌ను చాలా ఎఫెక్టివ్‌‌గా అమలు చేశామన్నారు. ఆర్‌‌ఎన్‌‌ఏ వైరస్‌‌ కాబట్టి వ్యాక్సిన్ రావడం కాస్త లేటవుతుందని అన్నారు. వ్యాధి తొలి స్టేజ్‌‌లోనే ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటే నయమని, ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదని డాక్టర్లు చెబుతున్నారని వివరించారు. కరోనాతో లంగ్స్ ఎఫెక్ట్ అయినవాళ్లు బతకడం కష్టమని, వెంటిలేటర్‌‌పై ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నోళ్లలో 10 శాతం మంది బతకడం లేదన్నారు.