టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో హైడ్రామా నడిచింది. ఈ ఇష్యూపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు సమాచారమిచ్చారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులతో తమను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సీపీ తెలిపారు. 

ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఫాంహౌస్ పై రైడ్ చేశామన్నారు. రైడ్లో ఫరీదాబాద్, తిరుపతి, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు (సింహయాజులు, నంద కుమార్, రామచంద్రభారతి) దొరికారని.. లీగల్ యాక్షన్ తీసుకుని దర్యాప్తు చేస్తామని  సీపీ వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

కొత్త నాటకాలకు తెరతీశారు 

‘‘ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేసిందంటూ కొత్త నాటకాలకు తెరతీశారు. ఏమిటీ డ్రామా ? కేసీఆర్ చెప్పే కట్టుకథలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో మళ్లీ గెలిచే సత్తా ఎవరికీ లేదు. అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పి యాదగిరి గుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దగ్గర కేసీఆర్ ప్రమాణం చేయాలి’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. 

రాజకీయ మనుగడ కోసం దుష్ట రాజకీయాలు

‘‘మునుగోడు బైపోల్ తేదీ సమీపించిన ప్రస్తుత తరుణంలో కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్న కొత్త నాటకమిది. ఆ తండ్రి,కొడుకులకు ఇలాంటి చెత్త వ్యవహారాలు, దిగజారుడు రాజకీయాలు కొత్తేం కాదు. రాజకీయ మనుగడ కోసం టీఆర్ఎస్ చేస్తున్న దుష్ట రాజకీయాలను, అవాస్తవ ప్రచారాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు.