మేం రాజీనామాలు చేస్తే.. కిషన్ రెడ్డి పారిపోయిండు

మేం రాజీనామాలు చేస్తే.. కిషన్ రెడ్డి పారిపోయిండు

ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వివక్ష చూపుతుందో చెప్పాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల జోలికి వస్తే మసై పోతరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ బయటపడిందని వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి విదేశాలకు పారిపోయిండని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పై మరో ఉద్యమం చేస్తామన్న ఆయన... ఓరుగల్లు పోరుగల్లుగా మారుతుందని చెప్పారు. మాట తప్పిన బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు తన్ని తరిమేస్తరని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.