గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారింది

గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారింది

హైదరాబాద్: రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గవర్నర్ తమిళి సై ప్రయత్నిస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాన్ని గెలవలేమని బీజేపీ నేతలు గ్రహించారని, ఈ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని తెలిపారు. 

ఇకపోతే... గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ మీడియాతో  మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్సిటీలు, ఆస్పత్రులు, హాస్టళ్లలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారని.. తాను భయపడనని పని చేసుకుంటూ వెళ్తానని చెప్పారు. గవర్నర్ ఛైర్ ను మాత్రమే గౌరవించాలంటున్నానని తమిళిసై స్పష్టం చేశారు. తాను ఏం మాట్లాడినా రాజకీయం అంటున్నారని..రాజకీయం లేనిది ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరానిదా అంటూ గవర్నర్  ఆగ్రహం వ్యక్తం చేశారు.