మోడీ వద్దన్నా బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరిండ్రు

మోడీ వద్దన్నా బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరిండ్రు

హైదరాబాద్: బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన పలువురు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నేతలు  టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ జాతీయ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందనే వాదనలో వాస్తవం లేదన్నారు. వారి సమావేశాలను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 

కేసీఆర్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు వాస్తవాలు తెలియడానికే తాము ప్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశామని, బీజేపీకి పోటీగా ఎంత  మాత్రం కాదన్నారు. గతంలో పరేడ్ గ్రౌండ్ లో తాము సభ పెట్టుకుంటామంటే అనుమతి నిరాకరించిన ఆర్మీ అధికారులు... ఇవాళ బీజేపీ సభకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పీఎం మోడీకి స్వాగతం పలకకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందనే వాదనలో నిజం లేదన్న ఆయన... గతంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని ఘనంగా రిసీవ్ చేసుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా తమలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు.  మోడీ ఎంత వారించినా బీజేపీ కార్పొరేటర్లు తమ పార్టీలోకి రావడం ఆపలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసే బీజేపీ కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారని తెలిపారు.